దొంగల ముఠా యాప్‌తో ఠా | Find the thieves with the app | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా యాప్‌తో ఠా

Sep 25 2017 2:18 AM | Updated on Aug 18 2018 4:44 PM

Find the thieves with the app - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : రాష్ట్ర వ్యాప్తంగా చోరీలను అరికట్టడానికి పోలీసులు కొత్తగా ప్రవేశ పెట్టిన ఏపీ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాల్లో యాప్‌కు విస్తృత ప్రచారం కల్పిస్తుండగా, మరి కొన్ని జిల్లాల్లో పోలీసులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ముఖ్య పట్టణాలలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

యాప్‌ను ఇలా డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి
ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఏపీ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ అప్లికేషన్‌ను డౌన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్‌ స్క్రీన్‌పై రిజిస్టర్, రిక్వెస్టు పోలీసు వాచ్‌ అనే రెండు ఆప్షన్లు వస్తాయి. రిజిస్టర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి అందులో సెల్‌ఫోన్‌తోపాటు ఇంటి అడ్రస్‌ టైప్‌ చేయాలి. తర్వాత రిజిస్టర్‌ నౌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే కొన్ని సెకండ్లలోనే సెల్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుంది. ఆ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే సక్సెస్‌ఫుల్‌ ఓటీపీ అనే మెసేజ్‌తో పాటు అందులో ఐడీ నంబర్‌ వస్తుంది. ఆ నంబర్‌ను గుర్తుండేలా ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. ఒకటి లేదా నాలుగైదు రోజులు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే వెంటనే రిక్వెస్ట్‌ పోలీసు వాచ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఐడీ నంబర్, ఎప్పుడు వెళ్తారో, ఏ తారీఖున తిరిగి వస్తారో అందులో పొందు పరచి సబ్‌మిట్‌ అని క్లిక్‌ చేయాలి. వెంటనే ఈ మెసేజ్‌ ఏపీ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్తుంది. వచ్చిన మెసేజ్‌ ఆధారంగా సంబంధిత ఫోన్‌ నంబర్‌కు పోలీసులు మళ్లీ ఒక సారి ఫోన్‌ చేసి రిక్వెస్టును సరి చూస్తారు. నిర్ధారించుకున్న తర్వాత కొన్ని నిమిషాల్లోనే సీసీ కెమెరా తీసుకొచ్చి ఇంట్లోని రహస్య ప్రాంతంలో అమరుస్తారు. ఈ కెమెరా రాత్రి, పగలు పని చేస్తుంటుంది. కెమెరా ముందు నుంచి మనిషి లేదా పిల్లి, ఎలుక లాంటివి వెళ్లినా కంట్రోల్‌ రూంలో అలారం మోగుతుంది. అక్కడి పోలీసులు కంట్రోల్‌ రూం ద్వారా సీసీ కెమెరా దృశ్యాలను చూస్తారు. ఒక వేళ ఇంట్లోకి ప్రవేశించింది మనిషి అయితే వెంటనే బీట్‌ పోలీసులు, సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీకి సమాచారం అందిస్తారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి దొంగను అదుపులోకి తీసుకుంటారు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో...
లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టంపై జిల్లా పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇప్పటి వరకు 14,800 మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇందులో ప్రొద్దుటూరులోనే 5,950 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. సీసీ కెమెరాలు కావాలని ప్రొద్దుటూరుకు చెందిన 90 మంది రిక్వెస్టు పెట్టుకున్నారు. ప్రొద్దుటూరు నియోజక వర్గానికి సంబంధించి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు జమాలుల్లా ఖాన్, రవి, ఎస్‌ం బాషా, హోంగార్డు మునీంద్ర మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు కంట్రోల్‌ రూంలో విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐలు వెంకటశివారెడ్డి, సదాశివయ్య, ఓబులేసు, ఎస్‌ఐలు కూడా పర్యవేక్షిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement