కొడుకును చదివించలేకపోతున్నానని.. 

Female junior artist committed suicide - Sakshi

మహిళా జూనియర్‌ ఆర్టిస్టు ఆత్మహత్య 

హైదరాబాద్‌: కన్నమ్మ కష్టాలు కాటితో కడతేరాయి. కొడుకును చదివించలేని దీనస్థితి ఆమె ఉసురు తీసింది. కొడుకు భవిష్యత్‌ను చేజేతులా పాడుచేస్తున్నానన్న ఆందోళన.. కుటుంబాన్ని పోషించలేని నిస్సహాయత.. ఇంటిఅద్దె కూడా చెల్లించలేని దుస్థితి.. వెరసి ఓ మహిళా జూనియర్‌ ఆర్టిస్ట్‌ను బలిగొన్నాయి. పడరానిపాట్లకుతోడు సన్నిహితుడి వేధింపులు ఎక్కువవడంతో తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సీహెచ్‌ సత్యశ్రీ(35) కొంతకాలం క్రితం నగరానికి వచ్చింది. కొడుకు నాగవంశీ(10)తో కలసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని కమలాపురి కాలనీ హనుమాన్‌ దేవాలయం సమీపంలో అద్దెకుంటోంది. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ కొడుకును పోషిస్తోంది. 2013లో భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మణికొండకు చెందిన సురేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

రెండేళ్లపాటు అతడితో చనువుగా ఉంది. ఇటీవల అతడు ఆమె వద్దకు రావడం మానేశాడు. సత్యశ్రీని ఫోన్‌లో దూషించడం, హెచ్చరించడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ నెల 14న ఫోన్‌ చేసి ఆమెను అసభ్యకరంగా తిడుతూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. సత్యశ్రీ ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపింది. తినడానికి ఏదైనా టిఫిన్‌ తెస్తానని మంగళవారం కొడుకు బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మృతి చెందింది. తన తల్లి మరణానికి సురేశ్‌ వేధింపులే కారణమంటూ నాగవంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంతకాలంగా తన చదువుపై బెంగపెట్టుకుందని, ఫీజులు చెల్లించలేకపోతున్నానని బాధపడేదని నాగవంశీ పేర్కొన్నాడు. ఇంటి అద్దె కూడా చెల్లించలేకపోతున్నామని తెలిపాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top