పెళ్లిరోజున మృత్యుఒడికి..

Farmer Couple Died With Current Shock in Rangareddy - Sakshi

విద్యుత్‌షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం

పొలంలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలే కారణం

అనాథలైన ఇద్దరు బాలికలు

ధారూరు మండలం కొండాపూర్‌ఖుర్దు గ్రామంలో ఘటన

ధారూరు: పెళ్లిరోజే రైతు దంపతులు విద్యుదాఘాతానికి బలయ్యారు.  వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి భార్యాభర్తలు మృత్యువాత పడిన విషాదకర సంఘటన ధారూరు మండలంలోని కొండాపూర్‌ఖుర్దు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లాడ సుధాకర్‌రెడ్డి (40), తన భార్య ఇందుమతి (36), ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. తనకున్న మూడెకరాల పొలంలో సుధాకర్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చేమంతి పూలు, గోరుచిక్కుడు పంట సాగుచేశాడు. అయితే ఆదివారం ఉదయం సుధాకర్‌రెడ్డి, తన భార్యతో కలిసి చేమంతి తోటకు క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు.

నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన భార్య ఇందుమతి పొలంలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను తాకడంతో షాక్‌ తగలింది. వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి ఆమె అరుస్తూ నేలకొరిగింది. భార్య అరుపుతో భర్త సుధాకర్‌రెడ్డి కంగారుతో వెంటనే పరుగుతీశాడు. ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయన కూడా విద్యుదాఘాతానికి గురయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనను చూసిన సమీపంలోని రైతులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సీఐ దాసు, ఏఎస్‌పీ భాస్కర్, డీఎస్‌పీ శిరీష తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. అయితే పెళ్లిరోజే ఇద్దరు మృత్యువాతపడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

వేలాడే తీగలే ప్రాణం తీశాయి.
పొలం మధ్యలో రెండేళ్ల కిందట వేసిన విద్యుత్‌ తీగలే ఈ ప్రమాదానికి కారణమైంది. మనిషి ఎత్తులో ఉన్న ఈ తీగలకు విద్యుత్‌ సరఫరా లేదు. వ్యవసాయ కనెక్షన్‌ నుంచి విద్యుత్‌ సరఫరాను తీసేశారు. ఆ జంపర్‌ వైర్లను ఒకే స్తంభానికి పైన ఉన్న ఎల్‌టీ లైన్‌ వద్ద స్తంభానికి చుట్టి వదిలిపెట్టారు. అయితే శనివారం సాయంత్రం గాలిదుమారానికి జంపర్‌ తీగ ఒకటి స్తంభం నుంచి విడిపోయి సరఫరా లేని లైన్‌ తీగపై పడింది. దీంతో ఆ విద్యుత్‌ తీగలకు విద్యుత్‌ సరఫరా అయ్యింది. ఎప్పటిలాగానే ఆ తీగకు విద్యుత్‌ సరఫరా లేదని భావించి వెళ్లిన ఆ దంపతులు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు.

రైతుల ఆందోళన
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలయ్యాయని.. న్యాయం చేసేంత వరకు తరలించడానికి వీల్లేదని కుటుంబసభ్యులతో పాటు రైతులు ఆందోళన చేవారు. దీంతో ఏఎస్‌పీ భాస్కర్, డీఎస్పీ శిరీష, విద్యుత్‌ ఏడీఈ రాంచందర్‌ హుటాహుటిన వచ్చారు. రూ.10 లక్షల పరిహారం మూడు నెలల్లో వచ్చేలా చూస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.

ప్రమాదానికి కారణం ఈ స్తంభమే..విద్యుత్‌ తీగలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
అధికారుల నిర్లక్ష్యమే కారణం?
ఈ ఘటనకు విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యమేనని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పిదమే దంప తుల ప్రాణాలు బలయ్యాయని వాపోతున్నారు. చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలు వారిని బలి తీసుకున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని రైతులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనతో ఆ కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం అధికారులు ప్రకటించి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. 

రైతుబీమాకు కుటుంబం దూరం
గ్రామానికి చెందిన నారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు సుధాకర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి. తనకున్న 8 ఎకరాల్లో ఇద్దరు కుమారులకు మూడెకరాల చొప్పున పొలం కేటాయించారు. అయితే కుమారుల పేరుపై పట్టామార్పు చేయలేకపోయారు. పొలం మొత్తం తండ్రి పేరునే ఉండడంతో సుధాకర్‌రెడ్డికి రైతు బీమా పథకం వర్తించదు. రైతు దంపతులు మృతి చెందడం, కూతుళ్లు అనాథలవడంతో వారికి ఎలాగైనా ప్రభుత్వం సహాయం చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. 

ఎమ్మెల్యే పరామర్శ..
విద్యుదాఘాతంతో మృతిచెందిన దంపతుల కుటుంబసభ్యులను వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పరామర్శించారు. ఘటనా స్థలం పొలం వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనాథలైన చిన్నారులను అక్కున చేర్చుకుంటానని ప్రకటించారు. ఇద్దరిని తాను చదివిస్తానని హామీ ఇచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top