నకిలీ విజిలెన్స్‌ ముఠా ఆటకట్టు

Fake Vigilance Gang Arrest in Hyderabad - Sakshi

బ్లాక్‌ ఆయిల్‌ వ్యాపారికి డ్రైవర్‌ టోకరా  

స్నేహితులతో నకిలీ విజిలెన్స్‌ ముఠా ఏర్పాటు

రూ. లక్షల్లో దోపిడీ గతంలో

ఔషాపూర్‌లో, తాజాగా యామ్నాంపేటలో దోపిడీ

నిందితుల అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: రోడ్ల నిర్మాణంలో వినియోగించే బ్లాక్‌ ఆయిల్‌ వ్యాపారం చేస్తున్న ట్యాంకర్‌ యజమానులను లక్ష్యంగా చేసుకొని విజిలెన్స్‌ అధికారుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8.8 లక్షల నగదు, కారు,  సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మేట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డితో కలిసి అదనపు పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు బుధవారం వివరాలు వెల్లడించారు.  అనంతపురం జిల్లా, గుంతకల్‌కు చెందిన షేక్‌ జహీర్‌ అహ్మద్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) నుంచి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్‌ సరఫరా చేసేవాడు.  ఏడాది క్రితం కంపెనీ చిత్తూరుకు తరలించడంతో ట్యాంకర్లు అవసరం లేదని కంపెనీ చెప్పింది. దీంతో గుంతకల్లుకు చెందిన ఫజుల్‌ రెహమన్‌ను తన ట్యాంకర్‌ డ్రైవర్‌గా నియమించుకొని లైసెన్స్‌డ్‌ డీలర్ల నుంచి బ్లాక్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి అవసరమైన వారికి విక్రయించేవాడు.

బ్లాక్‌ ఆయిల్‌ కొనుగోలుకు పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లే ఫజుల్‌ రహమాన్‌ ఈ విషయాన్ని తన స్నేహితులైన భూషణ్‌ హరీశ్‌ అలియాస్‌ నిఖిల్‌కు చెప్పాడు. దీంతో అతను తన స్నేహితులు  నునవత్‌ తులసీ, భరత్, శ్రీను, వినోద్‌కుమార్‌లతో కలిసి విజిలెన్స్‌ అధికారులుగా అవతారమెత్తారు. ఇదే సమయంలో బ్లాక్‌ ఆయిల్‌ కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఫజుల్‌ రెహమాన్‌ ఆయిల్‌ నింపుకొని తిరిగి వెళుతూ తమ వద్ద రూ.3 లక్షలు ఉన్నట్లు నిఖిల్‌కు సమాచారం అందించాడు. దీంతో అతను తన ముఠాతో కలిసి సభ్యులతో ఔషాపూర్‌ వద్ద ట్యాంకర్‌ను అడ్డుకున్నారు. పథకం ప్రకారం ఫజుల్‌ రెహమాన్‌ ట్యాంకర్‌ యజమాని జహీర్‌కు ఫోన్‌ చేసి విజిలెన్స్‌ అధికారులు ట్యాంకర్‌ను పట్టుకున్నారని విడిచిపెట్టేందుకు రూ.మూడు లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత నగదు తీసుకొని నిఖిల్‌ గ్యాంగ్‌ అక్కడి నుంచి పరారైంది. దీనిపై ఘట్‌కేసర్‌ పీఎస్‌లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఫజుల్‌ రెహమాన్‌పై అనుమానం వచ్చిన యజమాని అతడి వివరాలపై ఆరా తీయగా గుంతకల్‌లో 2018లో కేసు నమోదైనట్లు తెలియడంతో అతడిని పనిలోనుంచి తొలగించాడు.  

ఫోన్‌ చేసి.. దోచుకున్నారు...
దీనిని మనస్సులో పెట్టుకున్న ఫజుల్‌ రెహమాన్‌ పథకం ప్రకారం బ్లాక్‌ ఆయిల్‌ అమ్ముతానంటూ తన స్నేహితుడు నిఖిల్‌తో జహీర్‌కు ఫోన్‌ చేయించాడు. అయితే బక్రీద్‌ పండుగ ఉన్నందున తాను రాలేనని చెప్పడంతో డ్రైవర్‌ను పంపిస్తే బ్లాక్‌ ఆయిల్‌ లోడింగ్‌ చేసి పంపుతామని నమ్మించాడు. దీంతో అతను డ్రైవర్, క్లీనర్లకు రూ. 6 లక్షలు ఇచ్చి యామ్నాంపేటకు పంపాడు. అదే రోజు రాత్రి కారులో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు ట్యాంకర్‌ను ఆపి తాము విజిలెన్స్‌ అధికారులమని లారీ డాక్యుమెంట్లు తనిఖీ చేయాలంటూ కారులో డ్రైవర్‌ను ఎక్కించుకొని రూ.6 లక్షలు తీసుకున్నారు. సమీపంలోని పంక్చర్‌ దుకాణం వద్ద మరో ఇద్దరితో కలిసి అక్కడికి వచ్చిన నిఖిల్‌ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ డ్రైవర్‌ను కారులోనుంచి కిందకు తోసి పరారయ్యారు. లారీ యజమాని జహీర్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన భువనగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ బి.రాజు నేతృత్వంలోని బృందం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏపీ28 సీజీ8152 కారు నంబర్‌ కారులో అదే ముఠా ఔషాపూర్‌ వద్ద మాటు వేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.8.8 లక్షల నగదు, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు. గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసు సిబ్బందిని అదనపు సీపీ రివార్డులతో సత్కరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top