దళారీ గద్దలు

Fake Jobs  Gang In Warangal - Sakshi

బరిగెల శివకుమార్‌ అనే యువకుడు ఉద్యోగంపై ఆశతో ప్రశాంత్‌నగర్‌కు చెందిన వ్యక్తిని నమ్మి రూ.4 లక్షలు సమర్పించుకున్నాడు. శివకుమార్‌ లాంటి బాధితులు సదర వ్యక్తి ఖాతాలో ఎందరు ఉన్నారో లెక్కలేదు. అతడిని డబ్బుల కోసం నిలదీసిన బాధితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన ఘన చరిత్ర అతడికి ఉంది. కాజీపేట రహమత్‌ నగర్‌కు చెందిన తేలు సారంగపాణిది మరో గాథ. అన్న కొడుకు ఇంజనీరింగ్‌ చదివి ఇంటి వద్ద పనీపాట లేకుండా ఉంటున్నాడు.. ఏదైనా అవకాశం ఉంటే చూడు అంటూ పరిచయం ఉన్న వ్యక్తితో బాధను పంచుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు వ్యక్తి నేరుగా విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం పంపిస్తానంటూ రూ.7.50 లక్షలు వసూలు చేసి నట్టేట ముంచాడు. అడగబోతే మాటలతో ఎదురుదాడి చేశాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించి సగం డబ్బులను వసూలు చేసుకోవడంలో సఫలీకృతుడైన బాధితుడిపై ఇంకా సదరు దళారీ ఎదురుదాడి ఆగకపోవడం గమనార్హం.

కాజీపేట (వరంగల్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లు కొంతమంది దళారులకు వరంగా మారుతున్నాయి. నిరుద్యోగుల అమాయకత్వం, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న ఆశ బ్రోకర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. రెగ్యులర్‌ ఉద్యోగాలకు ఓ రేటు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు మరో రేట్‌ను ఫిక్స్‌ చేసి మొదట పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌గా వసూలు చేస్తున్నట్లు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవల అటవీ శాఖ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌(ఎఫ్‌బీఓ), సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయడమేగాక రాతపరీక్ష కూడా నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి వారికి మెడికల్‌ టెస్ట్‌లు, ఇతర ఈవెంట్లకు అర్హులుగా నిర్ధారించింది.

రాతపరీక్ష నెగ్గి ఈ పరీక్షల కోసం వేచి చూస్తున్న వారిలో చాలామంది దళారుల బారినపడినట్లు తెలిసింది. ఎలాగూ రాత పరీక్ష నెగ్గినందున ఎన్ని డబ్బులు పెట్టయినా కొలువు సంపాదించుకుందామని ఆశపడుతున్న వారు దళారుల వలలో చిక్కుకుంటున్నారు. దళారులకు సంబంధిత శాఖలో ఒకరిద్దరు అధికారులతో పరిచయాలు ఉండడం, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో వారిని నిరుద్యోగులు నమ్ముతూ లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అలాగే వైద్య, ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో కూడా ఇటీవల కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులోనూ దళారులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగులకు వల విసిరినట్లు తెలిసింది. దీనికి తో డు ఇటీవల వివిధ శాఖల్లో జరుగుతున్న ఔట్‌సో  ర్సింగ్‌ ఉద్యోగ నియామకాల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌కు చెంది న కొన్ని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు తమకున్న రాజకీయ పలుకుబడితో గుట్టుచప్పుడు కాకుండా నియామకాలు చేస్తున్నాయి. వీరు ఆయా ప్రాంతాల్లోని తమ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులను నియమించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు  వెల్లువెత్తుతున్నాయి.

రైల్వేలో కొలువులపై...
రెగ్యులర్‌ ప్రాతిపదికన రైల్వేశాఖలో భర్తీ చేయబోతున్న ఏఎల్‌పీ, టెక్నీషియన్, గ్రూప్‌–డీ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల రాత పరీక్షలు ప్రారంభం కావడంతో ఫలితాలు అనుకూలంగా రావడం కోసం పైరవీలు చేస్తామంటూ దళారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రచారం. నియామక ప్రక్రియ పకడ్బందీగా జరుగుతున్నప్పటికీ అభ్యర్థుల అత్యాశ, దళారుల మాయమాటల కారణంగా చెల్లింపులు జరుగుతున్నాయంటున్నారు.

ఔట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ కొలువులకు..
వివిధ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు లక్షలాది రూపాయలు డిమాండ్‌ ఉంది. ఇటీవల వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేయడానికి కొన్ని ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి భర్తీ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్లుగానీ, రోస్టర్‌ విధానం అమలు చేయకుండా ఈ సంస్థలు రహస్యంగా భర్తీ వ్యవహారాలు నడుపుతున్నాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తికావడంతో తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెబుతూ కొందరు దళారులు అమాయకులను వంచిస్తున్నారు. టీచర్‌ పోస్టుకు రూ.లక్ష, ఆయా పోస్టుకు రూ.50 వేల చొప్పున ఇప్పటికే కొందరు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతపెద్ద ఎత్తున దళారులు సాగిస్తున్న ఈ అక్రమ వ్యవహారాలపై సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి అమాయకులు నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి మోసం చేసే వ్యక్తులపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. పారదర్శకంగా ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతున్నందున దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. అలాగే పోలీస్‌ స్టేషన్‌లో నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ జరుపుతాం.    – సీహెచ్‌.అజయ్, సీఐ, కాజీపేట 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top