బురిడీ బాబాకు చెక్‌! | Fake Baba Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

బురిడీ బాబాకు చెక్‌!

Jan 22 2019 10:42 AM | Updated on Jan 22 2019 10:42 AM

Fake Baba Gang Arrest in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మహిళలను ధనవంతులను చేస్తామని బురిడీ కొట్టిస్తూ...వారి నగలు అపహరిస్తున్న ముఠా నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 32.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాల సమీపంలోని కిరాణా దుకాణాల్లో ఉన్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా చోరీలకు పాల్పడింది. గతేడాది అక్టోబర్‌ 22న నగరంలో ఐదు గంటల్లో ఆరు చోట్ల చోరీ చేసిన ముఠాలోని ప్రధాన నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావుతో కలిసి సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. 

నమ్మించి..నట్టేట ముంచి..
బురిడీ బాబాలుగా అవతారమెత్తిన ఇరానీ గ్యాంగ్‌ సభ్యులు దేవాలయాల సమీపంలోని దుకాణాల్లో ఒంటరిగా ఉన్న మహిళల వద్దకు వెళ్లి కొబ్బరికాయ, అగర్‌బత్తీలు, బిస్కట్‌ ప్యాకెట్లు, చెరకు ముక్కలు కొనుగోలు చేస్తారు. అనంతరం కొద్ది సేపటికి తిరిగివచ్చి గుడికి వెళ్లామని, పూజారి లేడని చెబుతూ వారిని మాటల్లో దించుతారు. పాలిథిన్‌ కవర్‌లో చుట్టిన పూజా సామగ్రితో పాటు రూ.1100 పూజారి వచ్చిన తర్వాత ఇవ్వాలని చెబుతూనే...ఈ పూజాసామగ్రితో బరువైన వస్తువు కలిపి పూజ చేస్తే మీరు ఐశ్వర్యవంతులవుతారని నమ్మిస్తారు. వారి మాటలు నమ్మిన మహిళలు మెడలోని బంగారు వస్తువు తీసి ఇవ్వగానే రూ.100 నోటుతో ఆ బంగారు పుస్తెల తాడును సంచిలో పెట్టినట్లు నమ్మించి అభరణాలను మాయం చేస్తారు.

పూజారి వచ్చిన అనంతరం వాటిని ఇవ్వాలని చెప్పి అక్కడినుంచి జారుకునేవారు. ఈ తరహాలో గత ఏడాది అక్టోబర్‌ 22న రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లిలో నలుగురు సభ్యులతో కూడిన ముఠా ఐదు గంటల్లో ఆరు చోరీలకు పాల్పడింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న సీపీ సజ్జనార్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవంబర్‌ 5న నిందితులు జైకుమార్‌ రజక్, నియాజ్‌ మహమ్మద్‌ ఖాన్‌లను అదుపులోకి తీసుకోగా సీపీ వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. చోరీసొత్తు రికవరీ కాకపోవడంతో ప్రధాన నిందితుడు వసీమ్‌ అబ్బాస్‌ సిరాజ్‌పై నిఘా ఉంచారు. అతను శంషాబాద్‌లోని రాజీవ్‌ గృహకల్పలో ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం సిరాజ్‌ను అరెస్టు చేసి అతడి నుంచి 32.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. 

వసీమ్‌పై దేశవ్యాప్తంగా కేసులు
దేశవ్యాప్తంగా 39 ప్రాంతాల్లో 51 ఇరానీ గ్యాంగ్‌లు ఉన్నాయి. గత 60 ఏళ్లుగా వీరు దృష్టి మరల్చి సొత్తు సంబందిత చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఓ ముఠాకు నేతృత్వం వహిస్తున్న వసీమ్‌పై దేశవ్యాప్తంగా కేసులు ఉన్నాయి. 2010లో అతను కర్ణాటక పోలీసులు చిక్కాడు. ఆ తర్వాత ఠాణే, ఓల్డ్‌ ముంబైలో వివిధ నేరాల్లో పోలీసులకు చిక్కిన వసీమ్‌ 2017 నవంబర్‌లో ఓల్డ్‌ ముంబైలో జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం ముంబై, ఠాణే, వారణాసి, అలహాబాద్, పాట్నాలో 58 నేరాలకు పాల్పడ్డాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement