పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ 

Expulsion of Paripoornananda Swamy From Hyderabad City  - Sakshi

మంగళవారం రాత్రి  ఆయనకు నోటీసులు జారీ 

బుధవారం కాకినాడకు తరలించిన ప్రత్యేక బృందం 

అక్కడి శ్రీపీఠంలో అప్పగించి వచ్చిన పోలీసులు 

గడిచిన మూడు రోజుల్లో ఇది రెండో ఉదంతం 

సాక్షి, హైదరాబాద్‌: ‘ధర్మాగ్రహ యాత్ర’చేపడతానని ప్రకటించిన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయనకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగు పెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున స్వామిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠానికి తరలించాయి. గత రెండు రోజులుగా ఆయన హౌస్‌ అరెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరహాలో ‘శాంతిభద్రతల సమస్య’పేరుతో నగర బహిష్కరణకు గురైన రెండో వ్యక్తి స్వామి పరిపూర్ణానంద. సోమవారం సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను నగరం నుంచి బహిష్కరించడం, ఆ విషయాన్ని స్వయంగా రాష్ట్ర డీజీపీ ప్రకటించడం తెలిసిందే. నగర పోలీసు చరిత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కారణాలతో నగర బహిష్కరణ చేయడం ఇదే తొలిసారి. రానున్న ఎన్నికల సీజన్‌ నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఏడాది క్రితం నాటి అంశాలను ప్రస్తావిస్తూ.. 
ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో రాముడిని ఉద్దేశించి కత్తి మహేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి నిరసనగా స్వామి పరిపూర్ణానంద యాత్రకు సిద్ధం కావడం తెలిసిందే. హైదరాబాద్‌ పోలీసులు పరిపూర్ణానందకు జారీ చేసిన ఐదు పేజీల నోటీసులు ఏడాది క్రితం నాటి అంశాలను ప్రస్తావించారు. గతేడాది నవంబర్‌లో మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో జరిగిన సభలో రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ ప్రకటన చేసిన స్వామి పవిత్ర యాత్రకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. డిసెంబర్‌లో కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మార్చిలో కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

పది రోజులుగా కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానంద చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు కారణమయ్యేలా, అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ‘ధర్మాగ్రహ యాత్ర’పేరుతో స్వామి చేపట్టదలచిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆదివారం విలేకరులతో మాట్లాడిన స్వామి యాత్ర కొనసాగిస్తానని ప్రకటించారని, ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఆస్కారం ఉందని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. కాకినాడకు చెందిన పరిపూర్ణానంద తరచుగా హైదరాబాద్‌ వచ్చి ఉంటున్నారని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇవి రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయని, ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని పోలీసు కమిషనర్‌ సూచించారు. 

నాలుగేళ్ల తర్వాత మళ్లీ ‘తడిపార్‌’

ఇలా నగర బహిష్కరణ విధించడాన్ని తడిపార్‌ అంటారు. మాజీ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావు నగర పోలీసు కమిషనర్‌గా ఉండగా దీన్ని ఎక్కువగా వినియోగించారు. ఆపై బి.ప్రసాదరావు కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2008 నుంచి అనేక మందిని నగరం నుంచి బహిష్కరించారు. 2014లో చాదర్‌ఘాట్‌కు చెందిన హిస్టరీ షీటర్‌ మహ్మద్‌ జాబ్రీపై పడిన తడిపార్‌ వేటే ఆఖరిది. అంతకు ముందు రౌడీషీటర్లు జంగ్లీ యూసుఫ్, ఖైసర్, లేడీ డాన్‌ ఫర్హాఖాన్‌.. ఇలా ఎంతో మందిని నగరం నుంచి బహిష్కరించారు. అయితే నగర పోలీసు కమిషనరేట్‌ చరిత్రలో ఇప్పటి వరకు రౌడీషీటర్లు, కరడుగట్టిన నేరగాళ్లను మాత్రమే బహిష్కరించే వారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం పేరుతో తడిపార్‌ చేయడం ఇదే తొలిసారి. సిటీలో గతంలోనూ అనేక మంది రాజకీయ నాయకులు, పెద్దలు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారిపై ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top