దేవికారాణి, పద్మల మధ్య రాజీకి నాగరాజు యత్నం! | ESI Medicine Scam Devika Rani Involves Non Registered Companies | Sakshi
Sakshi News home page

అవినీతిలో పోటాపోటీ!

Oct 2 2019 3:41 AM | Updated on Oct 2 2019 8:54 AM

ESI Medicine Scam Devika Rani Involves Non Registered Companies - Sakshi

తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్లుగా ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో నిందితులంతా పోటాపోటీగా అవినీతికి పాల్పడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్లుగా ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో నిందితులంతా పోటాపోటీగా అవినీతికి పాల్పడ్డారు. మందుల కొనుగోళ్లలో ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మలు ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు. అసలేం జరిగిందంటే.. 2015లో దేవికారాణి బాధ్యతలు చేపట్టేనాటికే అక్కడ జాయింట్‌ డైరెక్టర్‌గా పద్మ విధులు నిర్వహిస్తున్నారు. 

ఐఎంఎస్‌కు మందులు సరఫరా చేసే పలు రిజిస్టర్‌ కంపెనీలతో ఆమె ముందే కుదుర్చుకున్న అవగాహన తెలుసుకున్న దేవికారాణి తానేం తక్కువ తిన్నానా అని నాన్‌ రిజిస్టర్డ్‌ కంపెనీలపై కన్నేశారు. అత్యవసర సమయాల్లో నాన్‌ రిజిస్టర్‌ కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయవచ్చన్న చిన్న వెసులుబాటును ఆసరాగా చేసుకుని దేవికారాణి సొంతంగా వ్యవహారం నడిపారు. ఇందుకోసం పలు రకాల కంపెనీలను కూడా అప్పటికప్పుడు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

2018లోనే విజిలెన్స్‌ విచారణ.. 
వాస్తవానికి డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆకాశరామన్న ఉత్తరాలతో 2018 నవంబర్‌లోనే అవినీతి విషయం విజిలెన్స్‌కు చేరింది. ఈ విషయంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని విజిలెన్స్‌ 2019 ఫిబ్రవరిలోనే నివేదిక ఇచి్చంది. అయినా ఈ విషయం బయటకు పొక్కనీయలేదు. ఈ విషయంపై పలుమార్లు ముఖ్య కార్యదర్శి శశాంక్‌ గోయల్‌ హెచ్చరించినా దేవికారాణి పట్టించుకోలేదు. ఓమ్నీ, అవేంటార్, లెజెండ్‌ కంపెనీల నుంచి రూ.20 కోట్లకు పైగా అధిక ధరలకు చెల్లించి కొనుగోలు చేసిన విషయంపై శశాంక్‌ గోయల్‌ తీవ్రంగా పరిగణిస్తూ లేఖ రాయడంతో దేవికారాణిలో కాస్త చలనం వచి్చంది.

తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సరీ్వసెస్‌ అండ్‌ ఇన్‌   ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ధరల కంటే మీకు ఎక్కువ చెల్లించామని, అధిక మొత్తాన్ని వెంటనే తిరిగిచ్చేయాలని ఓమ్నీ, అవేంటార్, లెజెండ్‌ కంపెనీలకు దేవికారాణి విడివిడిగా లేఖలు రాశారు. దీనిపై ఆ కంపెనీ లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాము ముందు గా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ధర నిర్ధారించామని, తీసుకున్న డబ్బును వెనక్కిచ్చేది లేదని కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాయి. 

చక్రం తిప్పడంలో నాగరాజు కీలకం.. 
వీరిద్దరి అవినీతిలో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ నాగరాజు పాత్ర చాలా కీలకం. ఐఎంఎస్‌లో కొన్నేళ్లుగా చిన్న మందుబిళ్లల కొనుగోళ్లలో ఇతనే ఆధారం. ఐఎంఎస్‌కు మందులు సరఫరా చేసే ఓమ్నీ, అవేంటార్, లెజెండ్‌ కంపెనీలతోపాటు ఏకంగా 42 కంపెనీలకు ఇతనే రిప్రజెంటేటివ్‌ అంటే ఐఎంఎస్‌లో ఇతను ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి జాయింట్‌ డైరెక్టర్‌ పద్మతో అధిక ధరలకు కోట్‌ చేసుకుంటున్న నాగరాజు.. తర్వాత డైరెక్టర్‌ దేవికారాణినీ కుంభకోణంలో భాగస్వామిని చేశాడు. 

వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు ఏసీబీ, విజిలెన్స్‌కు ఉత్తరాలు రాయడం, విజిలెన్స్‌ నివేదికలో అక్రమాలు నిజమే అని నిర్ధారణ జరగడంతో నాగరాజు రంగప్రవేశం చేశాడు. విషయం బయటికి పొక్కకపోవడంతో వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతడి ముందు రాజీకి అంగీకరించినా.. తర్వాత వీరి తీరులో మార్పురాకపోవడంతో విషయం కార్మిక సంఘాలు, ఏసీబీ వరకు వెళ్లింది. నాగరాజు కేవలం తెలంగాణకే కాదు, ఏపీలోనూ ఇవే కంపెనీలకు ప్రతినిధిగా ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement