
ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ మరణం చిత్రపరిశ్రమను అశనిపాతంలా తాకింది. తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన నేడు(జూలై 7న) అందరికీ వీడ్కోలు చెప్తూ నింగికేగాడు. అందరికీ దిలీప్ కుమార్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు వరకు ఆయనను అందరూ ఇదే పేరుతోనే పిలిచేవారు. మరి ఆయన పేరెందుకు మార్చుకున్నాడు? ఎవరు మార్చారు? అనేది తెలియాలంటే ఇది చదివేయండి..
యూసఫ్ ఖాన్‌కు నటుడిగా మొదటి ఛాన్స్ ఇచ్చింది నిర్మాత దేవికా రాణి. తను తెరకెక్కించిన 'జ్వర్ భాతా' సినిమా ద్వారా ఆయనను కథానాయకుడిగా పరిచయం చేసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందే అతడికి పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది. నిన్ను నటుడిగా ఆవిష్కరించబోతున్నానని, దానికంటే ముందు నీకు స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని యూసఫ్ ఖాన్‌తో చర్చించింది. అప్పుడు ఆ స్క్రీన్ నేమ్‌తోనే అందరూ పిలుస్తారని, అందులోనూ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పేరైతే బాగుంటుందని అభిప్రాయపడింది. అంతేకాక ఏ పేరు పెడితే బాగుంటుందా? అని ఆలోచిస్తున్న సమయంలో దిలీప్ కుమార్ అనే పేరును కూడా ఆవిడే సూచించింది. ఆ పేరు తనకు కూడా సమ్మతమే కావడంతో యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్‌గా స్థిరపడ్డాడు.