ఎవరు బాధ్యులు?

Employment Guarantee Scheme employ commit to suicide - Sakshi

ప్రాణాలు తీసుకుంటున్న చిరుద్యోగులు

అధికారుల వేధింపులవల్లే అంటున్న సిబ్బంది

నెలరోజుల క్రితం కాంట్రాక్ట్‌ బోర్‌ మెకానిక్‌

నిన్న ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్‌

సస్పెన్షన్‌ వెకేట్‌ చేయమన్నా పట్టించుకోని అధికారి

రెండేళ్లుగా అనధికార విధులు నిర్వర్తిస్తున్నా గుర్తించని వైనం

కొన్ని నిర్ణయాలు అమాయకులను బలితీసుకుంటాయి. కొందరి వేధింపులు కొన్ని బతుకులను రోడ్డున పడేస్తాయి. కొత్తవలసలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలు అక్కడి అధికారుల నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాయి. నెల రోజుల క్రితం ఓ కాంట్రాక్టు బోర్‌ మెకానిక్‌ ఆత్మహత్య చేసుకోగా... తాజాగా ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్‌ కూడా ఆ బాటలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఇవి యాదృచ్ఛికమే అయినా... ఇందుకు ప్రోత్సహించిన పరిణామాలను ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది.

సాక్షిప్రతినిధి, విజయనగరం: కొత్తవలస మండలం కంటకాపల్లి పంచాయతీ ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడైన పెదిరెడ్ల ఆనంద్‌ను రెండేళ్ల క్రితం సస్పెండ్‌ చేశారు. సోషల్‌ ఆడిట్‌లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అప్పటి పీడీ ప్రశాంతి ఈ చర్యలు తీసుకున్నారు. అనంతర కాలంలో అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువుకాకపోవడంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా అక్కడి ఎంపీడీఓ పి.నారాయణరావుకు సూచించారు. కానీ ఆయన మాత్రం ఇంకా ఆనంద్‌ సస్పెన్షన్‌లోనే ఉన్నాడంటున్నారు. రెండేళ్ల నుంచి ఆనంద్‌ విధులు నిర్వర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఆయన చేసిన సంతకాలను కంప్యూటర్‌ ఆపరేటర్, ఏపీఓ, ఎంపీడీఓలు ధ్రువీకరించి లక్షల రూపాయల బిల్లులు కూడా చేసేశారు. గత జూలై 15వ తేదీ వరకూ ఉపాధి పనులకు సంబంధించి ఎన్‌ఎంఆర్‌ షీట్లలో ఆనంద్‌ చేసిన సంతకాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితమే విధులకు దూరమైన ఉద్యోగి వాటిలో ఎలా సంతకాలు చేశారన్నది జవాబు లేని ప్రశ్న.

జీతం లేకున్నా...
కానీ ఆయనకు రెండేళ్లుగా జీతం రావడం లేదు. ఇంతలో ఏమైందో ఏమో మూడు నెలల క్రితం నుంచే ఆనంద్‌ను విధులకు రానివ్వడం లేదు. రెండేళ్లుగా జీతం లేక, మూడు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆనంద్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్‌ ఇచ్చిన రికార్డుల ఆధారంగా ఉపాధి హామీలో దాదాపు రూ.40 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. రెండేళ్ల క్రితం సస్పెండ్‌ అయిన ఆనంద్‌ సంతకానికి ఇన్ని లక్షల రూపాయలు ఎలా విడుదలయ్యాయి. మూడు నెలల క్రితం నుంచే విధులకు హాజరుకాకపోవడం ఏమిటి ఇవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలే.

నెల రోజుల క్రితం బోర్‌మెకానిక్‌...
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో(ఆర్‌డబ్ల్యూస్‌) కాంట్రాక్ట్‌ బోర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న మునగపాక శ్రీనివాసరావు కొత్తవలస–కె కోటపాడు రోడ్డులో ఉన్న పాత ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో గత నెల 14వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి ఆయన మరణానికి కూడా అధికారులే కారణమంటున్నారు. మూడు నెలల పాటు అతనికి జీతం ఇవ్వకుండా నిలిపివేయడంతో అతను మనస్తాపం ప్రాణాలు తీసుకున్నాడన్నది ఆరోపణ. అతను మరణించిన తర్వాత కూడా ప్రాణాంతక వ్యాధివల్ల ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తప్పుడు ప్రచారం చేయగా తన్నులు కూడా తిన్నారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది. ఈ లోగానే ఆనంద్‌ ఆత్మహత్య చేసుకోవడం, ఇద్దరూ ఒకే ఎంపీడీఓ పరిధిలో పనిచేసేవారే కావడం విశేషం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top