టీ తాగడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి..

Elderly Woman Died While Collapse Hotel Roof Visakhapatnam - Sakshi

శ్లాబ్‌ సన్‌షేడ్‌ కూలి వృద్ధురాలి దుర్మరణం

ఆరిలోవ (విశాఖ తూర్పు): ఆరిలోవలో టీ తాగడానికి వెళ్లి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. చేతికందిని టీ తాగకుండానే మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ రెండో వార్డు పార్వతినగర్‌లో కుమారుడితో కలిసి ఉంటున్న డోల రాములమ్మ(70) ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో అంబేడ్కర్‌నగర్‌లో ప్రధాన రహదారి పక్కన ఓ టీ స్కాల్‌ వద్దకు టీ తాగడానికి వెళ్లింది. రోజూ ఉదయం, సాయంత్రం ఆమె టీ తాగడానికి అక్కడికే వెళ్తుండేది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆమె అక్కడ టీ కోసం షాపు ముందు నిలబడింది. షాపు యజమాని టీ చేతికి అందించే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పైనుంచి శ్లాబ్‌ సన్‌షేడ్‌ కూలిపోయింది. అదే సమయంలో కిందన టీ కోసం నిలబడి ఉన్న రాములమ్మపై సన్‌షేడ్‌ పెచ్చులు ఊడిపోయాయి. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమె కుడికాలు పాదం వద్దకు విరిగిపోయింది. ఒక్కసారిగా పెచ్చులు పడటంతో తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే రాములమ్మ ప్రాణాలు విడిచింది. ఆ శబ్ధం విన్న స్థానికులు అక్కడకు చేరుకొని 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకొని ఆమెను పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించి వెళ్లిపోయారు. ఆరిలోవ ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. రాములమ్మ జీవీఎంసీలో శానిటేషన్‌ వర్కర్‌గా పనిచేసేది. ఆమెకు కుమారుడు, కోడలు ఉన్నారు.

ఉదయం ప్రమాదం జరిగి ఉంటే భారీ నష్టమే
అంబేడ్కర్‌నగర్‌ ప్రధాన రహదారి పక్కన కొన్నాళ్ల క్రితం నిర్మించిన ఓ ఇంటిలో రెండు షాపులు రహదారి పక్కన ఉన్నాయి. వాటిలో ఓ టీ దుకాణం, మరో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఉదయం పూట ఈ రెండు షాపుల వద్ద టీ, టిఫిన్, కిరాణా సామాన్లు కోసం వచ్చిన వారితో రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే ఎక్కువ మంది ప్రామాదానికి గురై ఉండేవారని, సాయత్రం 4.30 గంటల సమయం కావడంతో పెద్దగా ఆ షాపుల వద్దకు వచ్చే వినియోగదారులు లేరని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో టీ కోసం వచ్చిన రాములమ్మ మాత్రమే ఉండటంతో ఆమె బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఇంటి శ్లాబ్‌ శిథిలమై చిన్నచిన్న పెచ్చులు ఊడిపోతున్నాయని... ఇప్పుడు మొత్తం కూలిపోయిందని అంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top