మార్ఫింగ్‌ డాక్టర్‌!

Doctor Arrest in Cyber Crime Hyderabad - Sakshi

ఫొటోలతో వైద్యుడి వికృత చేష్టలు

మాజీ స్నేహితురాలి కాపురంలో చిచ్చు

నిందితుడి అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: వృత్తిరీత్యా వైద్యుడైన అతను విపరీత ధోరణి ప్రదర్శించాడు... మెడిసిన్‌లో తనకు క్లాస్‌మేట్‌ అయిన వివాహిత ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడు... వాటిని ఆమె తరఫు వారికే పంపి కాపురంలో చిచ్చుపెట్టాడు... బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎల్బీనగర్‌కు చెందిన సదరు వైద్యుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. వివరాల్లోకి వెళితే..ఎల్బీనగర్‌కు చెందిన సోహెబ్‌ అలీతో పాటు నగరానికి చెందిన మరికొందరు కొన్నేళ్ల క్రితం చైనాలో ఎంబీబీఎస్‌ చదివారు. అప్పట్లో ఇతడికి క్లాస్‌మేట్స్‌ అయిన యువతీ,యువకుడు ఆపై వివాహం చేసుకుని భార్యభర్తలుగా మారారు. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఎంబీబీఎస్‌లో తన క్లాస్‌మేట్స్‌తో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేయాలని భావించిన సోహెబ్‌ దీనికోసం కొత్తగా ఓ సెల్‌ఫోన్‌ నంబర్‌ తీసుకుని గ్రూప్‌ ఏర్పాటు చేశాడు. ఇందులో బాధితురాలు, ఆమె భర్త సైతం సభ్యులుగా ఉన్నారు.

కాలేజీ రోజుల్లో సదరు యువతితో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేసి వాటిని సదరు‘ఎంబీబీఎస్‌ గ్రూప్‌’లో పోస్ట్‌ చేశాడు. గ్రూప్‌ అడ్మిన్‌ ఎవరనేది సభ్యులు తెలియకుండా ఉండేందుకు కొత్త నంబర్‌తో దీనిని క్రియేట్‌ చేసిన అతను తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు క్లాస్‌మేట్స్‌కు తెలిసిన తన పాత నెంబర్‌తో తనకు తననూ ఓ సభ్యుడిగా యాడ్‌ చేసుకున్నాడు.  గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయడమే కాకుండా అందులో అభ్యంతరకరమైన తన భార్య ఫొటోలు, వీడియో లో పోస్ట్‌ చేయడంతో ఆమె భర్త అవాక్కయ్యాడు.  దీనిపై భార్యను నిలదీయడంతో ఇద్దరి మధ్య స్ఫర్ధలు తలెత్తాయి. ఈ విషయం తనకు ఏమీ తెలియదని, ఆ గ్రూప్‌ అడ్మిన్‌ ఎవరో కూడా తనకు తెలియదని భర్తకు చెప్పడంతో  ఆయన దీనిపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిని పసిగట్టిన నిందితుడు ఇందుకు విని యోగించిన సిమ్‌కార్డును ధ్వంసం చేసి ఆధారాలు చిక్కకుండా చేయాలని భావించాడు. అయితే సాంకేతికంగా దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోహెబ్‌ అలీ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top