నయీం ఎన్‌కౌంటర్, అక్రమాలపై వ్యాజ్యాల కొట్టివేత

Defamation of lawsuits on Nayeem encounter and irregularities - Sakshi

హైకోర్టు ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన ప్రత్యేక పరిస్థితులు ఏమున్నాయో పిటిషనర్లు వివరించలేకపోవడంతో ఈ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కి చెందిన మండవ శ్రీనివాస్‌ 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు.

నయీం అరాచకాలకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం వాటిని మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. సిట్‌ దర్యాప్తు తుది దశకు చేరుకుందని తెలిపింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top