రైతు నెత్తిన మృత్యుతీగలు

Dangerous electrical wires - Sakshi

పంట పొలాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలు

సరిచేయాలన్న రైతుల మొరను ఆలకించని అధికారులు

అక్కారంలో కరెంటు తీగలు తగిలి రైతు మృతి

గజ్వేల్‌: పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్‌ తీగలు ప్రమాద ఘంటికలను మోగిస్తూనే ఉన్నాయి. ఈ తీగలను సరిచేసి ప్రాణాలను కాపాడాలంటూ రైతులు వేడుకుంటున్నా పట్టించుకునే నా«థుడే కరువయ్యాడు. తాజాగా గజ్వేల్‌ మండలం అక్కారంలో రైతు మంద మల్లయ్య(55) తన పొలంలో వేలాడుతున్న వైర్లు తగిలి చనిపోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. గతంలో విద్యుత్‌ ప్రమాదాలు జరిగిన సమయంలో విద్యుత్‌ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరిస్తే ఈ రోజు ఈ ఘటన జరిగేది కాదన్న ఆవేదన స్థానికుల నుంచి వ్యక్తం అవుతోంది.

మల్లయ్య మాట పట్టించుకోని అధికారులు..
ఎప్పటిలాగే సోమవారం పొలానికి వెళ్లిన మల్లయ్య (55) వంగిన విద్యుత్‌ స్తంభం నుంచి వేలాడుతున్న కరెంటు తీగలు తాకి చనిపోయాడు. సపోర్ట్‌ లేకుండా పాతిన విద్యుత్‌ స్తంభం ప్రమాదకరంగా మారిందని...దానిని సరి చేయాలని మల్లయ్యతోపాటు పరిసర పొలాల రైతులు వేడుకున్నా ఏ అధికారి పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట ఈదురు గాలులతో కూడిన వర్షంతో స్తంభం క్రమ క్రమంగా వంగిపోయి...వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి.

పరిష్కారం చూపని పవర్‌ డే..
2015 జనవరి 17న వేలాడుతున్న విద్యుత్‌వైర్లు, వంగిన స్తంభాలను సరిచేయడంతోపాటు ఇళ్ల మధ్యన ప్రమాద ఘంటికలను మోగిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు, కాలం చెల్లిన కండక్టర్‌ వైర్లు, ఏబీ స్విచ్‌లు లేని ట్రాన్స్‌ఫార్మర్లు, పంట పొలాల్లో వేలాడుతున్న వైర్లను సరిచేయడం తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని ఎస్‌ఈ మొదలుకొని వివిధస్థాయిల అధికారులు గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలపై ‘పవర్‌ డే’ చేపట్టారు. నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ముగ్గురు నుంచి నలుగురు చొప్పున 600మందికిపైగా ఏకకాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలావరకు అధికారులు సమస్యలపై సర్వే చేపట్టి వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు తయారుచేశారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోని పలు గ్రామాల్లో జరిపిన సర్వేలో  1549 విరిగిన స్తంభాలు, 604 వంగిన స్తంభాలు, మధ్యలో వేయాల్సిన స్తంభాలు 3001, వేలాడుతున్న వైర్లు 1391, ఇళ్లమీద ఉన్న స్తంభాలు 1217 కావాల్సిందిగా అధికారులు తేల్చారు. ఏబీ స్విచ్‌లులేని ట్రాన్స్‌ఫార్మర్‌లు 258, ఎస్‌జీ ఫ్యూజ్‌లు లేని ట్రాన్స్‌ఫార్మర్‌లు 228, ఎర్తింగ్‌ సక్రమంగాలేని ట్రాన్స్‌ఫార్మర్‌లు 632, దిమ్మెలు సరి గాలేని ట్రాన్స్‌ఫార్మర్లు 91, కాలం చెల్లిన కండక్టర్‌ వైరు 87 కిలోమీటర్లు, వీధిలైట్లు ఆన్‌ఆఫ్‌ చేయడానికి కావాల్సిన వైరు 303 కిలోమీటర్లు, మరో 1099 స్విచ్‌లు కావాలని గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికి రూ. 5 కోట్లు వరకు వెచ్చించారు. కానీ పంట పొలా ల్లో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరిచేసే ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. ఫలితంగా పంట పొలాల్లో విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

మృతదేహం వద్ద రోదిస్తోన్న బంధువులు

గతంలో ప్రమాదాలు..
-    వర్గల్‌ మండలం సామలపల్లిలో ట్రాక్టర్‌పై గడ్డి నింపుకుని వస్తున్న యువరైతు నాగులపల్లి కేశవరెడ్డి గతనెల 13న కరెంటు తీగలకు తగిలి మృత్యువాతపడ్డాడు. 
-   ఇదే మండలంలోని నాచారంలో ఆరు నెలల క్రితం ఓ రైతు కరెంటు షాక్‌తో చనిపోయాడు. 
-    ఏడాది క్రితం తున్కిమక్త లో కరెంటు ప్రసరిస్తున్న ఇ నుప స్తంభం తాకి రెండు ఎ ద్దులు మృత్యువాతపడ్డాయి. 
-   అక్కారంలో 2013 డిసెం బర్‌ 26న సింగిల్‌ ఫెజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ఎర్తింగ్‌ లోపాలు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల ఊరంతా షాక్‌ వచ్చింది. ఈ ఘటనలో రాజు, చంద్రయ్య అనే ఇద్దరు మృతి చెందగా. అనేక మంది గాయాల పాలయ్యారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top