
సాక్షి, న్యూఢిల్లీ: అర్థరాత్రి సమయంలో ఢిల్లీ నడివీధుల్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనూహ్యమైన ప్రతిఘటన ఎదురైంది. రాత్రి బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారంచల్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక డీసీపీ మేఘన యాదవ్ వివరాలు వెల్లడిస్తూ.. ‘‘రాత్రి సమయంలో మా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వేళ నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో వారు మావాళ్లపై కారంతో దాడికి పాల్పడ్డారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపాం’’ అని వివరించారు.
ఈ ఘటనలో ఓ వ్యక్తికి అరెస్ట్ చేశామని, దాడికి పాల్పడ్డవారంతో ఒకే కుంటుంబానికి చెందినట్లుగా విచారణలో తేలిందని డీసీపీ వెల్లడించారు. అయితే అరెస్ట్ వ్యక్తిని సజన్‌గా గుర్తించిన పోలీసులు అతనిపై ఇదివరకే పలు కేసులు నమోదయి ఉన్నట్లు తెలిపారు. గ్రూపులుగా ఏర్పడి వారంత దోపిడీలకు పాల్పడుతున్నారని.. రాత్రి సమయంలో బందోబస్త్‌ను మరింత కట్టుదిట్టం చేస్తామని ఆయన వెల్లడించారు.