మకాంపై మూడోకన్ను! | City Police Third Eye On All Lodges and Hotels | Sakshi
Sakshi News home page

మకాంపై మూడోకన్ను!

Mar 28 2018 8:35 AM | Updated on Aug 14 2018 3:37 PM

City Police Third Eye On All Lodges and Hotels - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో చేతివాటం ప్రదర్శించిన ‘స్టార్‌ చోర్‌’ జయేష్‌ రావ్‌జీ సెజ్‌పాల్‌ సిటీలోనూ మూడుసార్లు చోరీలు చేశాడు. అలా నగరానికి వచ్చిన ప్రతిసారీ లాడ్జీల్లోనే బస చేశాడు. కేవలం ఇక్కడే కాదు... ఎక్కడకు వెళ్లినా, ఎన్నిసార్లు పంజా విసిరేందుకు పథకం వేసినా ఇలానే చేస్తుంటాడు. కేవలం జయేష్‌ ఒక్కడే కాదు అనేక మంది ‘వలస నేరగాళ్లకు’ లాడ్జిలు షెల్టర్‌ జోన్లుగా మారుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చి మార్కెట్‌ పరిధిలో 55 తులాల బంగారం తస్కరించిన జిలానీ, మేవాట్‌ రీజియన్‌ నుంచి వచ్చి అటెన్షన్‌ డైవర్షన్లకు పాల్పడిన టట్లు బాజీ గ్యాంగ్, ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన ‘మస్కా’రాలతో అందినకాడికి దండుకుపోయిన ముఠాలను అరెస్టు చేసిన తర్వాత వారు నగరంలోని లాడ్జిల్లో బస చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆయా ముఠాలకు ఆశ్రయం కల్పిస్తున్న లాడ్జిలు, హోటళ్లపై నిఘా కట్టుదిట్టం చేయాలని నగర పోలీసు విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ద్వారా సిటీలోని అన్ని లాడ్జిలు, హోటళ్లను అనుసంధానించాలని యోచిస్తోంది. వాటిలో బస చేస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు అందేలా, సెంట్రలైజ్డ్‌ డేటాబేస్‌లో ఇవి నిక్షిప్తమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. భవిష్యత్తులో ఓ నేరగాడు సిటీలోని ఏదైనా లాడ్జ్‌/హోటల్‌లో దిగిన వెంటనే తమను అప్రమత్తం చేసేలా ఆధునిక హంగులు సైతం అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ప్రస్తుతం కొంతమేర మాన్యువల్‌గా...
లాడ్జిలు, హోటళ్లలో బస చేసే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వాటిని సమీప పోలీసుస్టేషన్‌లో ఏరోజుకారోజు అందించాలనే నిబంధన అమలులోనే ఉంది. అయితే వాటి నిర్వాహకులు కస్టమర్ల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేసుకుంటున్నారు. వీటినే ప్రతుల రూపంలో పోలీసులకు అందిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏదైనా అంశం క్రాస్‌చెక్‌ చేయాలంటే ప్రస్తుతం కష్టసాధ్యంగా ఉంది. ఈ మాన్యువల్‌ వ్యవహారానికి బదులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. ఇందులో నగరంలోని లాడ్జిలు, హోటళ్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా అనుసంధానిస్తారు. ఆయా చోట్ల బస చేయడానికి వచ్చే వారి వివరాలు సిబ్బంది తమ కంప్యూటర్‌లో నమోదు చేసిన వెంటనే అవి సర్వర్‌ అనుసంధానంతో పోలీసులకు చేరిపోతాయి. నిర్ణీత కాలం వీటిని భద్రంగా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  
తప్పుడు వివరాలు చెప్పే చాన్స్‌ ఎక్కువే...
బయటి ప్రాంతాల నుంచి వచ్చి నగరంలోని లాడ్జిల్లో బస చేస్తున్న నేరగాళ్లు తప్పుడు వివరాలు చెప్పేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వాటి నిర్వాహకులు కచ్చితంగా వినియోగదారులకు చెందిన గుర్తింపుకార్డులను పరిశీలించడంతో పాటు దాని ప్రతిని సైతం తీసుకుంటున్నారు. అయితే ఈ గుర్తింపుకార్డులే నకిలీవి అయినప్పుడు చేసేదేమీ ఉండదు. దీంతో దాదాపు ఆయా వ్యక్తులకు చెందిన పేర్లు, చిరునామాలు పక్కాగా గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసు విభాగం దగ్గర ఉన్న ‘360 డిగ్రీస్‌ వ్యూ’ తరహా సాఫ్ట్‌వేర్‌ వాడాలని భావిస్తున్నారు. ఇలా రికార్డైన బస చేసిన నేరగాళ్ల వివరాలు పోలీసులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో నిత్యం పర్యవేక్షించే ఆస్కారం ఏర్పడుతుంది.  అనుమానిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై తక్షణం కన్నేసి ఉంచడానికి అనువుగా మారనుంది. నగరంలో నేరాలు చేసే ‘వలస నేరగాళ్లకు’ ఈ విధానం ద్వారా చెక్‌ చెప్పే ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

భవిష్యత్‌లో ప్రత్యేక ఎనలటిక్స్‌ జోడించి...
ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను భవిష్యత్తులో మరింత పరిపుష్టం చేయడానికీ నగర పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. నగరానికి సంబంధించిన, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నగరంలో నేరాలు చేసిన వారి ఫొటోలు పోలీసు విభాగం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ డేటాబేస్‌ను అనలటిక్స్‌ సాయంతో లాడ్జిలు/హోటళ్లకు చెందిన ఆన్‌లైన్‌ కనెక్టివిటీతో అనుసంధానిస్తారు. ఓ పాత నేరగాడు ఏదైనా లాడ్జిలో దిగినప్పుడు దాని నిర్వాహకులు అతడి వివరాలు నమోదు చేయడంతో పాటు వెబ్‌క్యామ్‌లో ఫొటో సైతం తీస్తారు. ఈ ఫొటో పోలీసు సర్వర్‌లోకి వచ్చిన వెంటనే ఎనలటికల్‌ సాఫ్ట్‌వేర్‌ పాత నేరగాళ్ల డేటాబేస్‌లో సరిచూస్తుంది. సదరు వ్యక్తి నేరచరితుడైనా, వాంటెడ్‌గా ఉన్నా తక్షణం గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ఇలా సిటీలో అడుగుపెట్టిన వెంటనే నేరగాళ్లను పట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడనుంది. గరిష్టంగా మరో మూడు నెలల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement