ఆమెది హత్య కాదు.. ఆత్మహత్యే? 

CID Team Finalise Madhu Pathar Not Murdered Is Suicide - Sakshi

విద్యార్థిని మధుపత్తార్‌ కేసులో సీఐడీ వర్గాల మాట  

ఫోరెన్సిక్‌ నివేదికలో స్పష్టం 

ప్రేమ గొడవలతో బలవన్మరణం?  

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ (23) అనుమానాస్పద మృతి కేసు అనూహ్య మలుపు తిరినట్లయింది. మధుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు శనివారం అనధికారికంగా వెల్లడించారు.

రాయచురు రూరల్‌: రాయచూరును కుదిపేసిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ (23) అనుమానాస్పద మృతి కేసు అనూహ్య మలుపు. గత నెల 13న నవోదయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని మధు ఇంటి నుంచి అదృశ్యమైంది. 16వ తేదీన నగరంలోని మాణిక్‌ ప్రభు ఆలయం వెనుక పొదల్లో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. జీవితంపై విరక్తితో మరణిస్తున్నట్లు ఒక లేఖ అక్కడ దొరికింది. ఆమెను దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు ధర్నాలు చేశాయి. సినీ ప్రముఖులు ఈ సంఘటనను ఖండిస్తూ సోషల్‌మీడియాలో ప్రకటనలిచ్చారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు చేపట్టి ఆమె ప్రియుడు సుదర్శన్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని రెండువారాలకు పైగా విచారించింది.  

విచారణలో ఏం తేల్చారు  
విచారణలో సుదర్శన్‌ యాదవ్, మధుల మధ్య ఉన్న ప్రేమ గొడవలే ఆమె ఆత్మహత్యకు కారణాలులని సీఐ  వర్గాలు చెబుతున్నాయి.  ఆమె మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదిక ఆధారంగా మధుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు శనివారం అనధికారికంగా వెల్లడించారు. తొమ్మిదిరోజుల పాటు సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న సుదర్శన్‌ యాదవ్‌ తాను మధు 8వ తరగతి నుంచి 12వ తరగతి వర కు ఒకే కళాశాలలో చదువుకున్నామని, పీయూసీ తరువాత మధు ఇంజినీరింగ్‌ను ఎంచుకుందని, తాను బీకాంలో చేరానని అతడు వివరించారు. ఇద్దరి కళాశాలలు వేరే అయినా ప్రేమ కొనసాగిందని చెప్పాడు. వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని, ఇది సహించలేని మధు సుదర్శన్‌ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని, ఈ గొడవలతో ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.  

తప్పుదోవ పట్టించే యత్నం:  ప్రజాసంఘాలు  
కా
గా సీఐడీ వర్గాల తీర్మానంపై ఆమె తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కూతురిని హత్యేనని తల్లిదండ్రులు ముందునుంచి ఆరోపిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికి, నిందితులను రక్షించడానికి సీఐడీ ప్రయత్నిస్తోందని పలు ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాలను కప్పిపెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని, మధు పత్తార్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top