తాళి..ఆలి..బాల్యం బలి | child marriages in ongole | Sakshi
Sakshi News home page

తాళి..ఆలి..బాల్యం బలి

Nov 6 2017 12:58 PM | Updated on Nov 6 2017 12:58 PM

child marriages in ongole - Sakshi

ఒంగోలు టౌన్‌: బాల్యానికి మూడుముళ్లు పడుతున్నాయి. అభం శుభం తెలియని వయసులోనే ఆడపిల్లల మెడకు అర్ధాంగి అనే తాడును తగిలిస్తున్నారు. ఆడుతూపాడుతూ.. చదువుకుంటూ గడపాల్సిన వయసులో బలవంతంగా అత్తారింటికి పంపిస్తున్నారు. ఒకటీరెండేళ్లు తిరిగేసరికి చంటిబిడ్డను చంకనేసుకుని ఆడపిల్లలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం. తన గురించే సరైన అవగాహన లేని వయసులో ఒక బిడ్డకు జన్మనిచ్చి, కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని కుమిలిపోతున్నారు. బాల్య వివాహాలను ఆపేందుకు అనేక చట్టాలను రూపొందించినప్పటికీ సక్రమంగా అమలుకాకపోవడంతో చిన్నారి పెళ్లికూతుర్ల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2012 నుండి 2017 వరకు జిల్లాలో అధికారికంగా 881 బాల్య వివాహాలను నిలిపివేశారు. అధికారికంగా ఏటా వందల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నప్పటికీ.. అనధికారికంగా ఇంకెన్ని జరుగుతున్నాయనేది ప్రభుత్వ యంత్రాంగానికి అంతుచిక్కడంలేదు.

బాల్య వివాహానికి బలమైన కారణాలు
కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్టపరుచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానా వ్యక్తికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించుకుని పిల్లలు కొంచెం పెద్ద కాగానే వివాహం చేసేస్తున్నారు.
మేనరికం సంబంధం ఉన్నవారిలో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తమ కూతుర్ని ఎలాంటి ఇంటికి పంపాల్సి వస్తుందోనన్న ఆందోళనలో.. మేనరికం కోసం ఆడపిల్ల పెద్దమనిషి కాగానే పెళ్లి చేసేస్తున్నారు.
తాము చనిపోయేలోగా తమ వారసుల పెళ్లిళ్లు చూడాలన్న వృద్ధుల కోరిక తీర్చడానికి కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తున్నారు.
ప్రస్తుత ఆధునిక ప్రభావం కూడా బాల్య వివాహాలు చేసేందుకు పురిగొల్పుతోంది. పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తరువాత ఎక్కడ దారితప్పుతారోనన్న ఆందోళనతో కొంతమంది తల్లిదండ్రులు మైనార్టీ తీరకముందే బలవంతంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు.
వివాహానికి అయ్యే ఖర్చు పెరిగిపోతోంది. పెద్ద కుమార్తెకు వివాహం చేసే సమయంలో చిన్న కుమార్తె మైనార్టీ తీరకపోయినా బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు.
అధిక సంతానం, పేదరికం కూడా బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. ఒక ఇంటిలో ముగ్గురికి మించి కుమార్తెలు ఉంటే వారిని త్వరగా అత్తారింటికి పంపించాలన్న ఉద్దేశంతో బాల్య వివాహాలు చేస్తున్నారు.
బాలిక విద్యార్హత, వయసు కూడా పరోక్షంగా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. బాలిక వయసు విద్యార్హతతోపాటు కట్నం కూడా పెరుగుతోంది. దీంతో హైస్కూల్, ఇంటర్‌ స్థాయిలోనే వివాహాలు జరిపించేస్తున్నారు.

 నేరము–శిక్ష
బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు. బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేస్తే వారి తల్లిదండ్రులతోపాటు ఆ బాల్య వివాహానికి సహకరించిన వారికి జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. బాల్య వివాహాలు జరగకుండా ఉత్తర్వులు జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది. అవసరమైతే అలా జరిగిన వివాహాన్ని చెల్లదని కూడా చెప్పే అధికారం ఉంది.

సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే..
బాల్య వివాహ నిరోధానికి రాజ్యాంగంలో ప్రత్యేక సెక్షన్లు రూపొందించారు.
ఐపీసీ సెక్షన్‌ 9 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు పెళ్లి చేస్తే వారి కుటుంబీలకు రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
ఐపీసీ సెక్షన్‌ 10 ప్రకారం బాల్య వివాహాలు నిర్వహించినవారికి, సహకరించినవారికి, ప్రోత్సహించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
ఐపీసీ సెక్షన్‌ 12 ప్రకారం బాల్య వివాహానికి ఎవరైనా హాజరైతే వారికి కూడా దాదాపు రెండేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.

ఎవరికి ఫిర్యాదు చేయాలి
బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే గ్రామ స్థాయిలో వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా పోలీసులకు(100), చైల్డ్‌లైన్‌(1098) టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్లు చేసి సమాచారం అందించవచ్చు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా కార్యకర్తలకు కూడా సమాచారాన్ని చేరవేయవచ్చు. బాల్య వివాహాల గురించి సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.

ఎదురు తిరిగిన ఘటనలు అరుదు
తల్లిదండ్రులు తమకు ఇష్టం లేకుండా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తుంటే ఎదురు తిరిగి వివాహ సంకెళ్లను అడ్డుకున్న ఘటనలు జిల్లాలో అరుదుగానే ఉన్నాయి. కొమరోలులో చదువుకుంటున్న ఒక బాలిక తన తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నించగా, తన స్నేహితులతో చెప్పుకుని ఎదురు తిరిగిన ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. అయితే అలాంటి బాలికలు అరుదుగానే ఉంటున్నారు. ఎక్కువ మంది బాలికలు తల్లిదండ్రుల మాటకు లోబడి తలొంచి తాళి కట్టించుకుంటూనే ఉన్నారు.

ఆదర్శంగా నిలిచిన సింగరాయకొండ పంచాయతీ
బాల్య వివాహాల నిరోధానికి సింగరాయకొండ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం సంచలనానికి దారితీసింది. తమ గ్రామ పంచాయతీలో బాల్య వివాహం చేయకూడదంటూ పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌ 28వ తేదీ జరిగిన పంచాయతీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. ఇదే మాదిరిగా మిగిలిన పంచాయతీలు కూడా తీర్మానాలు చేస్తే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement