ఏబీవీపై దేశద్రోహం కేసుపెట్టాలి

Chevireddy Bhaskar Reddy Comments On AB Venkateswara rao - Sakshi

అవినీతి సంపాదన కోసం 

దేశ భద్రతను పణంగా పెట్టారు 

దేశాన్ని విడిచి పారిపోయే అవకాశం.. లుకౌట్‌ నోటీసు ఇవ్వాలి

కేంద్రాన్ని కోరిన ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి

సాక్షి, తిరుపతి: వ్యక్తిగత స్వార్థం, అవినీతి సంపాదన కోసం దేశ భద్రతను పణంగా పెట్టి ప్రమాదకరమైన వస్తువులను కొనుగోలు చేసిన దేశద్రోహి ఏబీ వెంకటేశ్వరావు (ఏబీవీ) అని ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ ఏబీవీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఏబీవీ అంటే అవినీతికే బాస్‌ వెంకటేశ్వరరావు అంటూ అర్థం చెప్పారు. తిరుపతిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఏబీవీ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా చెవిరెడ్డి బయటపెట్టారు.

ఐపీఎస్‌ను వ్యక్తిగత రాజకీయ సర్వీసు (ఇండివిడ్యువల్‌ పొలిటికల్‌ సర్వీస్‌)గా మార్చారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారం రక్షణ పరికరాలను కొనుగోలు చెయ్యాలంటే.. కేంద్రం అనుమతి తీసుకోవాలని, కానీ ఏబీవీ అలాంటి అనుమతులు లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను కొన్నారని తెలిపారు. దేశానికి ప్రమాదకర వస్తువుల కొనుగోలుపై కేంద్రం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 124ఏ కింద దేశద్రోహం కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏబీవీ దేశాన్ని విడిచి వెళ్లే ప్రమాదం ఉందని, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయనపై ‘లుకౌట్‌’ నోటీసులు జారీ చేయాలని కోరారు.  

తెలంగాణ, కర్ణాటకలో రూ. కోట్ల ఆస్తులు
ఏబీవీకి తెలంగాణలో, కర్ణాటకలో వంద ఎకరాల భూములు ఉన్నాయని చెవిరెడ్డి తెలిపారు. వీటి విలువ రూ. వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని వివరించారు. ఈడీ, ఐటీ, అవినీతి నిరోధక శాఖ సమగ్ర విచారణ జరిపితే ఏబీవీ భూ దందాలు, అవినీతి బాగోతం వెలుగులోకి వస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ తరువాత అత్యంత ధనవంతుడు ఏబీవీ అన్నారు. ఆయన కుటుంబ సభ్యుల పేరున ఇసుకరీచ్‌లు తీసుకున్నారన్నారు. ఏబీవీ ఫోన్‌ కాల్‌ డేటా వెలికి తీస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. బెజవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఏబీవీ ఉన్నపుడు జరిగిన జంట హత్యల కేసులో విలువైన బంగారు ఆభరణాలను ఆయన మాయం చేశారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బ్లాక్‌మెయిల్‌ చేశారన్నారు. ఐపీఎస్‌ ఘట్టమనేని శ్రీనివాస్, డీఎస్పీ రాంకుమార్‌ వద్దే వందల కోట్లు ఉంటే వారి గురువు ఏబీవీ వద్ద ఇంకెన్ని కోట్లు ఉంటాయో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఏబీవీ అవినీతిని దగ్గరగా చూసిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ప్రభుత్వం ముందు నోరు విప్పాలని పిలుపునిచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top