ట్రైనీ ఐపీఎస్‌: కాపీయింగ్‌లో మరిన్ని నిజాలు

Chennai Police speed up enquiry on trainee IPS officer high tech mass copying - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్రైనీ ఐపీఎస్‌ సఫీర్‌ కరీం హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొచ్చి,  తిరువనంతపురం,  హైదరాబాద్‌లలోని కోచింగ్‌ కేంద్రాల్లో చాలా కాలం నుంచే ఇలాంటి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలుతున్నట్లు సమాచారం. విద్యార్థులతో మాస్‌కాపీయింగ్‌కు తన వద్దనున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజీని వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం బ్లూటూత్‌,  మీనియేచర్‌ కెమెరాలను ఉపయోగించినట్లు నిర్థారణకు వచ్చారు.

మాస్‌ కాపీయింగ్‌కు  1.5  కిలోమీటర్ల పరిధిలోపు పనిచేసే వైర్‌లెస్‌ మోడమ్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. ప్రస్తుతం కరీం గూగుల్‌ డ్రైవ్‌ అకౌంట్‌ను చెన్నై పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, అతడు రాసిన గత ప్రవేశ పరీక్షల వివరాలూ సేకరిస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ కోసం విద్యార్థుల నుంచి కరీం భారీ మొత్తాలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే కరీంతో పాటు అతడి భార్య జాయ్‌సీ జాయ్‌,  హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ కోచింగ్‌ సెంటర్‌ ఇంచార్జి పి.రాంబాబును ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే.

వీరి నుంచి 11 సెల్‌ఫోన్‌లు,  ఒక ట్యాబ్లెట్‌,  ల్యాప్‌టాప్‌,  నాలుగు హార్డ్‌ డిస్క్‌లు,  ఒక పెన్‌ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మైలాపూర్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు. మరో రెండు వారాల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక వస్తుందని భావిస్తున్నారు. కాగా కుమార్తెను చూసుకునేందుకు బెయిల్‌ మంజూరు చేయాలని కరీం భార్య జాయ్‌సీ జాయ్‌ విజ్ఞప్తితో న్యాయస్థానం ఆమెకు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top