కోర్టులో ఉద్యోగం కోసం చీటింగ్‌

Cheating Case Filed On Five Members For Duplicate Certificates - Sakshi

మహిళ సహా ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు

వివరాలు వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

లీగల్‌ (కడప అర్బన్‌) : జిల్లా కోర్టులో ఉద్యోగం పొందేందుకు ఓ మహిళ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కోర్టులో అటెండర్‌గా పనిచేస్తూ గాజులపల్లి సీతామహాలక్ష్మి ఏడాది క్రితం మృతి చెందింది. ఆమె వారసురాలిగా కుమార్తె దీపిక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. తాను పదవ తరగతి చదివినప్పటికీ ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవి సమర్పించింది. వీటిని ఇంటెలిజెన్సీ విభాగం వారికి కోర్టు వారు పరిశీలన నిమిత్తం పంపించారు. పదో తరగతి సర్టిఫికెట్‌ వరకు ఒరిజినల్‌గా ఉన్నట్లు, మిగతా ఇంటర్మీడియేట్, డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవిగా గుర్తించారు.

వెంటనే స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను అదేశించారు. అప్పటి ఏఓ వెంకట నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 20వ తేదీన వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో 420, 468, 471 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లుగా దీపికకు సర్టిఫికెట్లు ఇచ్చిన ముఠాపై దృష్టి పెట్టారు. వారిలో ఐదుగురిని గుర్తించి కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఈ ముఠాలో కడప నగరం మోచంపేటకు చెందిన షేక్‌ పర్వేజ్‌ అహ్మద్, అక్కాయపల్లెకు చెందిన సయ్యద్‌ గులాం జిలానీ, ఎర్రముక్కపల్లెకు చెందిన సగబాల మహేంద్రబాబు, అనంతపురం నగరానికి చెందిన పిడతల హరనాథ్, సిరిగుప్ప రాఘవేంద్రలు ఉన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  సోమవారం సాయంత్రం జిల్లా కోర్టులో విలేకరులకు వెల్లడించారు. అటెండర్‌ ఉద్యోగం చేయడానికి నామోషిగా భావించి ఉన్నత ఉద్యోగం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి దొరికిపోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top