బడి ఉంటే బతికేటోళ్లు బిడ్డా..

Brothers Died By Fell Down In Well In Warangal  - Sakshi

సాక్షి, కురవ(వరంగల్‌) : పండుగ ఆ ఇంట్లో చీకట్లను నింపింది.. తొలి ఏకాదశి పర్వదినం ఆ ఇంటికి దుర్ధిన్నాన్ని తెచ్చిపెట్టింది.పండుగ కావడంతో బడికి సెలవు ఇచ్చారు.. బడి ఉంటే బతికేటోళ్లు కదా బిడ్డాలారా.. అంటూ తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు గుండెల్నిపిండేసింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతనూరి శ్రీను, హైమ ల కుమారులు సూర్యతేజ(8) మూడో తరగతి, విశాల్‌(5) ఒకటో తరగతి చదువుతున్నారు. వీరి స్వగ్రామం తొర్రూరు మండలం వెంకటాపురం కాగా బతుకుదెరువుకోసం పదేళ్ల క్రితం మోద్గులగూడెంలో ఉంటున్నారు.

తిర్మలాపురంలోని తిరుమల వర్మీ కంపోస్టు తయారీ కేంద్రంలో గత సంవత్సర కాలంగా పనిచేస్తూ కుటుంబంతోసహా అక్కడే నివాసముంటున్నారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉండడంతో సూర్యతేజ, విశాల్, మరో స్నేహితుడు పుల్సర్‌ ఈశ్వర్‌తో కలిసి పాఠశాలకు ఎదురుగా ఉన్న మర్రికుంటలో ఈతకు వెళ్లారు. సూర్యతేజ, విశాల్‌లు కుంటలోకి దిగారు. నీరు ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ అందులో మునిగిపోయారు. దీంతో ఒడ్డు మీదున్న స్నేహితుడు ఈశ్వర్‌ పరుగెత్తుతూ వచ్చి గ్రామస్తులకు విషయాన్ని చెప్పాడు. గ్రామస్తులు కుంట వద్దకు వెళ్లేసరికే అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న కురవి ఎస్సై నాగభూషణం శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటరత్నం పరిశీలించారు.

గ్రామంలో విషాదఛాయలు
అన్నదమ్ములిద్దరూ కుంటలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బడి ఉంటే  బతికేటోళ్లు కదరా బిడ్డలూ అంటూ తల్లి హైమ రోదిస్తున్నతీరు చూసినవారంతా కన్నీటిపర్యంతమయ్యారు. కడుపున పుట్టిన ఇద్దరు కుమారులు ఒకే రోజు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చుడం ఎవరివల్ల కాలేదు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top