దారుణం | Brother Murdered in Assets Case Anantapur | Sakshi
Sakshi News home page

దారుణం

Jan 14 2019 9:17 AM | Updated on Jan 14 2019 9:17 AM

Brother Murdered in Assets Case Anantapur - Sakshi

హత్యకు గురైన ఆనంద్‌ దృశ్యం

మద్యానికి బానిసై రోజూ ఇంట్లోతగువులాడుతున్న తమ్ముడి తీరుతోవిసుగెత్తిపోయిన అన్న సహనంకోల్పోయాడు. తోడబుట్టిన వాడని కూడాచూడకుండా గుండ్రాయితో తలపై మోది ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత అరిటాకులో మృతదేహాన్ని చుట్టి చెరువులో పడేశాడు. హృదయ విదారక ఘటనరొళ్ల మండలంలో జరిగింది.

అనంతపురం, రొళ్ల: ఎల్‌కే పల్లి వడ్రహట్టిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన వడ్డే నాగేష్, ఆనంద్‌ (30) అన్నదమ్ములు. వీరు తల్లిదండ్రులు సత్యమ్మ, ఈరప్పతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం ఆనంద్‌ భార్య గంగమ్మ ప్రసవ సమయంలో మరణించింది. భార్య మృతితో జీవితంపై విరక్తి చెందిన ఆనంద్‌ తాగుడుకు బానిసయ్యాడు. తాగి ఇంటికి వచ్చినపుడు ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో తూలుతూ అన్న నాగేష్‌ను దూషించాడు. దీంతో ఇద్దరూ గొడవపడ్డారు. తల్లి జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పింది. కాసేపటి తర్వాత ఇంటి బయట నిద్రిస్తున్న ఆనంద్‌పై అన్న వడ్డే నాగేష్‌ గుండ్రాయి వేశాడు. తలపై బలంగా మోదడంతో మెదడు బయటకు వచ్చి రక్తస్రావం జరగడంతో ఆనంద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 

మృతదేహం విసిరివేత..
నాగేష్‌ తన తమ్ముడి మృతదేహాన్ని అరిటాకులో చుట్టి.. భుజాన వేసుకుని కె.బ్యాడిగెర చెరువు వద్దకు చేరుకున్నాడు. చెరువు గట్టుపై నుంచి మృతదేహాన్ని ముళ్లపొదల్లోకి విసిరాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వ్యక్తులు ఆనంద్‌ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారమందించారు. మడకశిర సీఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ మస్తాన్, సిబ్బందితో కలసి ఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుండేవాడని, తీరు మార్చుకోవాలని చెప్పినా వినకపోవడంతో తానే హత్య చేసి పడేశానని వడ్డే నాగేష్‌ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

అనాథలైన పిల్లలు
ఏడాది కిందట తల్లి గంగమ్మ.. ఇప్పుడు తండ్రి ఆనంద్‌ మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు గౌతమి, జీవిత అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement