ప్రే‘ముంచాడు’

boyfriend cheating woman with love affair - Sakshi

ప్రేమ పేరుతో యువతిని అనుభవించిన ఇప్పిలికి చెందిన కుర్రాడు

పెళ్లి మాట వచ్చేసరికి మొహం చాటేసిన వైనం

నెలరోజులుగా గ్రామ పెద్దల వద్ద పంచాయితీలు

ఎట్టకేలకు కేసు నమోదు

శ్రీకాకుళం రూరల్‌: నువ్వే నాకు సర్వసం అన్నాడు. నువ్వులేనిదే నేను జీవించలేనంటూ చేతిలో చెయ్యేసి ఓట్టేశాడు. అతని మాయ మాటలు నమ్మి ఓ మహిళ మోసపోయింది. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలు సైతం ప్రియుడి ప్రేమ మోజులో పడి తప్పించేసుకుంది. సర్వసం అప్పగించిన ఆమె చివరికి పెళ్లిచేసుకోమంటే ఆ మాయగాడు మొహం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని ఇప్పిలి గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన కరణం శ్రీనువాసరావు గడచిన ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ పేరుతో ఆ అమ్మాయికి తిప్పని పార్కులు లేవు, చూపించని సినిమాలు లేవు. ప్రియుడి ప్రేమ మోజులో పడిన ఆమె శారీరకంగా కూడా తలవంచక తప్పలేదు. చివరికి పెళ్లి చేసుకోమంటే ఆ కామాంధుడు మాట మార్చేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అభాగ్యురాలు న్యాయం కావాలంటూ గ్రామ పెద్దలను దపదఫాలుగా ఆశ్రయించింది. గ్రామపెద్దలు కూడా ససేమిరా అనడంతో చేసేదిలేక రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  

ప్రేమికుడి మాటలకు కట్టుబడి
నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని శ్రీనువాసరావు పూర్తిగా ఆ యువతికి నమ్మబలికాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలు కూడా తప్పించుకోమని ఒత్తిడిచేసినట్టు తెలిసింది. ఆయన ప్రేమమోజులో పడి వచ్చిన సంబంధాలన్నీంటిని వాయిదా వేసుకుంటూ వచ్చింది. అయితే నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, నువ్వు ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావని శ్రీనువాసరావును ఆ యువతి నెలరోజుల క్రితం నిలదీసింది. నిన్ను పెళ్లిచేసుకునే ఉద్దేశం నాకు లేదని, నీదిక్కున్న దగ్గర చెప్పుకో అంటూ తెగేసి చెప్పేశాడు.

రూ. 1.50 లక్షలకు బేరం?
జరిగిన అన్యాయంపై గ్రామ పెద్దలు బాధిత యువతి తరఫున మాట్లాడక పోగా చివరికి రాజీ కావాలంటూ రూ. 1.50 లక్షలకు బేరం పెట్టారు. ఈ డబ్బు తీసుకొని కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటే నీ అంతుచూస్తామని ఆ యువతిని శ్రీనువాసరావు బెదిరించినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనైనా కేసు వెనక్కి తీసుకోమని అవసరమైతే మహిళా సంఘాలతో పోరాటాలు చేస్తామంటూ ఆమె మొరాయించినట్టు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల సూచనలు మేరకు వైద్య పరీక్షలు నిమిత్తం రిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతుంది.

నెలరోజులుగా కేసుపై కుస్తీ
ఇదిలావుండగా తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఇప్పిలి గ్రామ పెద్దలు తప్పుదోవ పట్టించేందుకు పూనుకున్నారు. రాజీ కోసం అన్ని విధాలుగా బాధితురాలి కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వీలు పడకపోవడంతో మిన్నకుండిపోయారు. పోలీసులు కూడా చేసేదేమిలేకపోవడంతో ఎట్టకేలకు ఈ నెల 26న శ్రీనువాసరావుపై పలు సెక్షన్‌లు కింద కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top