కాకినాడలో కిడ్నాప్‌ కలకలం

Boy Kidnap Drama in Kakinada East Godavari - Sakshi

1.5 కిలోమీటర్ల దూరంలోనే దొరికిన బాలుడు

తప్పిపోయి ఉంటాడన్న డీఎస్పీ

కాకినాడ క్రైం: నగరంలోని మధురానగర్‌ ప్రాంతంలో ఓబాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడంటూ గురువారం కలకలం రేగింది. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్‌ చేశారని 100కు ఫోన్‌ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఆ బాలుడు పోలీసులకు దొరకడంతో అతనిని తల్లిదండ్రులకు అప్పగించడంతో సుఖాంతమైంది.  డీఎస్పీ కరణం కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్‌ (గోకులం) గణేష్‌ వీధిలో ఓ అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న కొండయ్యవలపు బూరయ్య నాలుగేళ్ల కుమారుడు గణేష్‌ గురువారం మధ్యాహ్నం అపార్టుమెంటు ముందు ఆడుకుంటూ కన్పించలేదు. దాంతో ఆందోళన చెందిన ఆ బాలుడి  తల్లిదండ్రులు పరిసరాల్లో వెదికినప్పటికీ ఫలితం లేకపోవడంతో  తమ కుమారుడు గణేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ 100కు డయల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

వెంటనే అప్రమత్తమైన డయల్‌ 100 సిబ్బంది డీఎస్పీ కరణం కుమార్, టూ టౌన్‌ సీఐ ఈశ్వరుడిని, ఇతర పోలీస్‌స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. డీఎస్పీ కుమార్‌ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. అచ్యుతాపురం రైల్వేగేటు సమీపంలో ఓ నాలుగేళ్ల బాలుడిని చూసినట్టు పోలీసులకు కొందరు సమాచారం అందించారు. దాంతో సీఐ ఈశ్వరుడు బృందం అక్కడకు వెళ్లి బాలుడు గణేష్‌ను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు దొరకడంతో ఇటు పోలీసులు, అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.  అపార్టుమెంట్‌ వద్ద ఆడుకుంటూ బాలుడు తప్పిపోయి ఉంటాడని, ఎవరూ కిడ్నాప్‌ చేసి ఉండరని డీఎస్పీ కుమార్‌ వివరించారు. చురుగ్గా వ్యవహరించి బాలుడిని వెదికి పట్టుకున్న పోలీసు సిబ్బంది, డీఎస్పీ కుమార్, సీఐ ఈశ్వరుడు, ఎస్బీ డీఎస్పీలు ఎం.అంబికా ప్రసాద్, ఎస్‌.మురళీమోహన్, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎస్సైలు టి.భద్రరావు, బి.కృష్ణమాచారి, ఇతర సిబ్బందిని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top