బాలుడిని మింగేసిన బావి

Boy Died in Bore Well in Guntur - Sakshi

మగబిడ్డ పుట్టాడని ఆ దంపతులు పొంగిపోయారు.. అయితే ఆ బిడ్డ పుట్టు మూగ, చెవుడుతోపాటు మానసిక వికలాంగుడని తెలిసి కుంగిపోయారు.. ఆపై బిడ్డే లోకంగా జీవిస్తున్నారు.. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.. బిడ్డను ఆడించేందుకు ఇంటి సమీపంలోని చెట్టువద్దకు చేరిన తండ్రి ఒక్క నిమిషం ఆదమరిచాడు.. పొంచి ఉన్న మృత్యువు పిలిచిందో ఏమో.. ఆ బిడ్డ సమీపంలోని బావి వద్దకు చేరుకున్నాడు. తండ్రి గుర్తించి పిలిచినా వినిపించక బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు..

గుంటూరు, గురజాల: అమ్మానాన్నల ఒడిలో ఆనందంగా గడపాల్సిన బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి మృతిచెందిన ఘటన గురజాల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణంలోని శ్రీదేవి రైసు మిల్లు సమీపంలో నివసించే బత్తుల దుర్గారావు, వెంకటేశ్వరమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సాయి కృష్ణ(4). అతను పుట్టుకతోనే మూగ, చెవుడుతోపాటు మానసిక వికలాంగుడు కావడంతో కూలిపనులు చేసుకుంటూనే ఆ దంపతులు అనుక్షణం బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ముఠాపనులకు వెళ్లే దుర్గారావు మధ్యాహ్నం వేళ బిడ్డను ఆడించేందుకు ఇంటి సమీపంలో ఉన్న చెట్టు వద్దకు వెళ్లాడు. పక్కనే ఉన్న మట్టికుప్ప వద్ద సాయికృష్ణ కూర్చుని ఆడుకుంటుండగా దుర్గారావు చూసి మురిసిపోయాడు. ఒక్క నిమిషం ఆదమరిచాడు. ఆ తరువాత చూడగా మట్టికుప్ప వద్ద బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడ్డాడు. ఆ సమీప ప్రాంతాల్లో వెతికాడు.

ఆ వైపుగా వెళ్తున్న వ్యక్తి సమీపంలో ఉన్న బావి వద్ద చిన్నపిల్లాడు ఉన్నాడని చెప్పడంతో దుర్గారావు ఒక్క పారుగున అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే బావి గట్టుపైకి చేరుకున్న కుమారుడిని చూసి పెద్దగా కేకలు వేసినా ఆ చెవిటి బిడ్డకు వినిపించలేదు. అడుగు ముందుకేస్తే ప్రాణం పోతుందని తెలియక సాయికృష్ణ బావిలోకి పడిపోయాడు. దుర్గారావు కేకలు విన్న చుట్టు పక్కల వారంతా బావి వద్దకు చేరుకున్నారు. ఒక వ్యక్తి బాలుడిని రక్షించేందుకు బావిలోకి దూకాడు. బావి ఎక్కువ లోతు ఉండటం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో బాలుడిని వెతికేందుకు సాధ్యంకాక పైకి వచ్చేశాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ వై.రామారావు, ఎస్‌ఐ ఎం.వాసు ఘటన స్థలానికి చేరుకుని, మోటార్లు ద్వారా బావిలోని నీటిని బయటకు తోడించారు. అనంతరం పట్టణానికి చెందిన దిలీప్, ఆర్మీ ఉద్యోగి జి.రవీంద్ర బావిలోకి దిగి మూడు గంటలకుపైగా వెతకగా సాయికృష్ణ దొరి కాడు. హుటాహుటిన బాలుడిని గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతిచెం దాడని నిర్దారించారు. ఆస్పత్రికి వచ్చిన సాయికృష్ణతల్లి వెంకటేశ్వరమ్మ బిడ్డ మృతిచెందాడని తెలుసుకుని కుప్పకూలిపోయింది. ఆమెకు డాక్టర్‌ లక్ష్మి వైద్యసేవలు అందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top