తాళం వేసిన ఇంటికి కన్నం

Big Robbery In Jadcharla - Sakshi

జడ్చర్లలో భారీ చోరీ

25 తులాల బంగారు నగల అపహరణ

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

జడ్చర్ల: స్థానిక సరస్వతీనగర్‌లో భారీ చోరీ చోటుచేసుకుంది. ఆదివారం ఊరు నుంచి ఇంటికి వచ్చిన ఇంటి యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు టీకే ఫణికిరణ్‌ కథనం ప్రకారం.. జడ్చర్ల కరూర్‌ వైశ్యబ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఫణికిరణ్‌ సరస్వతీనగర్‌లో ఓ అద్దె ఇంటిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం తాళం వేసి అందరూ సొంత ఊరు హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం ఆదివారం ఇంటికి తిరిగి వచ్చిన ఫణికిరన్‌ గేటు తాళం తీసి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లి డోర్‌ తీసేందుకు చూడగా తాళం విరగ్గొట్టి తలుపు తెరిచి ఉండడంతో దిగ్బ్రాంతికి లోనయ్యారు.

వెంటనే ఇంటిలోకి వెళ్లగా బెడ్‌రూంలో ఉన్న బీరువా బార్ల తెరచి అందులోని వస్తువులు, దుస్తులు గది నిండా చెల్లాచెదురై పడి ఉన్నాయి. బీరువాలోని లాకర్లో దాచిన బంగారు నగలు అపహరణకు గురయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ బాలరాజుయాదవ్, క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. బంగారు గాజు లు, నెక్లెస్‌లు, చైన్‌లు, పిల్లల గాజులు, చెవి కమ్మలు, బుట్టాలు, ఉంగరాలు తదితరవి కలిపి దాదాపు 25 తులాల వరకు ఉంటాయని బాధితుడు పేర్కొన్నారు. ఇటీవల తమ బ్యాంకు దినోత్సవం సందర్భంగా తనకు బహూకరించిన 100 గ్రాముల వెండి కాయిన్‌ తదితర కాయిన్స్‌ కూడా చోరీకి గురయ్యాయని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కుడికిళ్లలో అర్ధరాత్రి హల్‌చల్‌
కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని కుడికిళ్లలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. రెండు గంటల ప్రాంతంలో గ్రామంలోని ఊర చెరువు కట్ట సమీపంలో ఉన్న జనార్దన్‌రావు, భార్య శ్రీదేవి ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు వచ్చి ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. వెంటనే తేరుకుని చూడటంతో అప్పటికే పరుగులు తీసి వెళ్లిపోయినట్లు చెప్పారు. గ్రామంలోని బీసీకాలనీలో సైతం దొంగతనానికి ప్రయత్నించగా మహిళలు వెంటపడటంతో పారిపోయారు. గ్రామంలోని కొల్లాపూర్‌ ప్రధాన రహదారిపై ఉన్న నాగేష్‌ ఇంటి మేడ మీద కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా అతని భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్‌ ఎత్తుకుపోయారు. దీంతో గ్రామస్తులు రాత్రంతా వెతుకుతూ నిద్రలేని రాత్రి గడిపారు. ఉదయాన్నే కొల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో శ్రీదేవి, శివలీలలు ఎస్‌ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఆయన గ్రామానికి వచ్చి దొంగతనానికి పాల్పడిన ఇళ్లను పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top