జేకేఐఎస్‌ విస్తరణకు బాసిత్‌ కుట్ర!

Basit conspiracy for JKIS Expansion - Sakshi

జమ్మూకశ్మీర్‌కు చెందిన కొందరు యువకులతో కుట్ర 

ఆన్‌లైన్‌లో కొన్నాళ్లపాటు నడిచిన వ్యవహారం 

గతేడాది అరెస్టుకు ముందు అక్కడికి వెళ్లి వచ్చిన వైనం 

వెలుగులోకి వస్తున్న ఐసిస్‌ ఉగ్రవాది వ్యవహారాలు 

నగర యువకుల విచారణకు తాత్కాలిక విరామం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఐసిస్‌ విస్తరణకు భారీ కుట్ర పన్నిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌ జమ్మూకశ్మీర్‌లోనూ తన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాంతానికి చెందిన మరికొందరితో కలసి ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ జమ్మూకశ్మీర్‌ (జేకేఐఎస్‌) పేరుతో ఐసిస్‌కు అనుబంధ సంస్థను విస్తరించాలని ప్రయత్నాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు చెబుతున్నారు. దీనికోసం బాసిత్‌ గత ఏడాది ఆగస్టులో అరెస్టు కావడానికి ముందు అక్కడకు వెళ్లివచ్చాడని ఓ అధికారి పేర్కొన్నారు. కశ్మీర్‌కు చెందిన లోన్‌ అనే ఉగ్రవాది ఇతడికి షెల్టర్‌ ఇచ్చాడని బయటపడింది. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్‌ కేసులో ఎన్‌ఐఏ ఢిల్లీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12న బాసిత్, ఖదీర్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లిన విషయం విదితమే.  

ఆది నుంచీ ఉగ్రభావాలతోనే... 
చంద్రాయణగుట్టలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్‌ బీటెక్‌ రెండో సంవత్సరం వరకు చదివాడు. ఐసిస్‌లో చేరాలనే ఉద్దేశంతో 2014 ఆగస్టులో నోమన్, అబ్రార్, మాజ్‌తో కలసి బంగ్లాదేశ్‌ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు. కోల్‌కతాలో వీరిని పట్టుకున్న పోలీసులు నగరానికి తరలించి కౌన్సిలింగ్‌ చేసి విడిచిపెట్టారు. తరువాత కూడా వీరు ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లేందుకు యత్నించిన వీరిని 2015, డిసెంబర్‌ 27న నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకొచ్చిన బాసిత్‌ విదేశాలతో పాటు ఢిల్లీ, కశ్మీర్‌ల్లో ఉన్న ఐసి స్‌ నాయకులతో సంబంధాలు కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది మరోసారి ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఇతడు తీహార్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.  

వారి విచారణకు విరామం... 
బాసిత్‌ అరెస్టు కావడానికి ముందు అతడితో సంప్రదింపులు నెరపారని, పాతబస్తీలో సమావేశాలు నిర్వహించారనే ఆరోపణలపై షహీన్‌నగర్‌కు చెందిన జీషాన్, శాస్త్రీపురం వాసి మసూద్‌ తాహాజ్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షిబ్లీ బిలాల్‌ను ఎన్‌ఐఏ శనివారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఎన్‌ఐఏ హైదరాబాద్‌ యూనిట్‌ కార్యాలయంలో వీరిని 3రోజులు విచారించారు. మరోపక్క వార్దాలో ఉన్న బాసిత్‌ రెండో భార్య మోమిన్‌ను కూడా ఆమె ఇంటి వద్ద విచారించారు. ఈ ప్రక్రియకు మంగళవారం తాత్కాలిక విరామమిచ్చారు. వీరి నుంచి ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్న 13 సెల్‌ఫోన్లు, 11 సిమ్‌కార్డులు, ఐపాడ్, ఎక్స్‌టెర్నల్‌ హార్డ్‌డిస్క్, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఎస్డీ కార్డులు, వాకీటాకీలను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కశ్మీర్‌ ‘ప్రత్యేకం’ కావాలని..
జమ్మూకశ్మీర్‌ను ప్రాంతాన్ని ప్రత్యేక ఇస్లామిక్‌ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఏర్పాటైందే జేకేఐఎస్‌. ఖురాసన్‌ మాడ్యూల్‌కు అనుబంధంగా ఇది పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. జేకేఐఎస్‌లో బాసిత్‌తో పాటు కశ్మీర్‌కు చెందినలోన్, ఉత్తరప్రదేశ్‌లోని గజ్‌రోలాకు చెందిన పర్వేజ్, జంషీద్‌ సహా మరో నలుగురు సభ్యులు మాత్రమే కీలకంగా వ్యవహరించారు. జేకేఐఎస్‌ విస్తరణ కోసం గత ఆగస్టు 1న కశ్మీర్‌కు వెళ్లి వచ్చిన తర్వాతే ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు పర్వేజ్, జంషీద్‌ను అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top