గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు | Banned Gutka Smuggling Bangalore to SPSR Nellore | Sakshi
Sakshi News home page

గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు

May 28 2020 1:31 PM | Updated on May 28 2020 1:31 PM

Banned Gutka Smuggling Bangalore to SPSR Nellore - Sakshi

నిందితులు, గుట్కా, ఖైనీ బస్తాలను చూపుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది

నెల్లూరు(క్రైమ్‌): బెంగళూరు నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కాలు, ఖైనీలను గుట్టుగా దిగుమతి చేసుకుని కోళ్లఫారం సమీపంలోని గదిలో నిల్వ చేశారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న నెల్లూరులోని నవాబుపేట పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. బుధవారం నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. 

వివిధ మార్గాల్లో..
కోవూరు మండలం పెద్దపడుగుపాడు విన్నకోటవారి వీ«ధికి చెందిన అంకిరెడ్డి వినోద్‌కుమార్, ఎన్‌.సందీప్‌కుమార్‌లు గుట్కా, ఖైనీలను బెంగళూరు నుంచి వివిధ మార్గాల్లో నెల్లూరుకు దిగుమతి చేసుకునేవారు. వాటిని జిల్లాలోని పలువురు వ్యాపారులకు విక్రయించేవారు. కొంతకాలంగా వారు ప్రశాంతినగర్‌లోని పాడుబడిన కోళ్లఫారం వద్ద ఉన్న గదిని గోదాముగా చేసుకుని పెద్దఎత్తున గుట్కాలను నిల్వ చేశారు. లాక్‌డౌన్‌ వేళ అధిక ధరలకు వాటిని విక్రయిస్తూ జేబులు నింపుకోసాగారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ కె.వేమారెడ్డి తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి గోదాముపై దాడులు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి వీ1, హెచ్‌1 బ్రాండ్లకు చెందిన రూ.10,72,410 గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు. వారికి సహకరిస్తున్న వారి వివరాల గురించి ఆరాతీస్తున్నామన్నారు. నిందితుల్లో ఒకరైన వినోద్‌పై ఇప్పటికే పలు కేసులున్నాయని, త్వరలోనే రౌడీషీట్‌ సైతం తెరుస్తామని వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన ఇన్‌స్పెక్టర్‌ కె.వేమారెడ్డి, ఎస్సైలు రమేష్‌బాబు, బి.శివప్రకాష్, హెడ్‌ కానిస్టేబుల్‌ సాల్మన్, టి.శ్రీనివాసులు, కానిస్టేబుల్స్‌ బి.మోహన్‌బాబు. ఎస్‌.సురేంద్రబాబు, పి.వెంకటేశ్వర్లును డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement