
అన్నాంబ నుంచి వివరాలు తెలుసుకుంటున్న వీఆర్‌ఓ గణేష్
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: తన భర్త ఏపీఎస్పీ హెచ్‌సీ బొడబళ్ల సతీష్ వచ్చే వరకు తాను కొట్టాం గ్రామంలోనే ఉంటానని బెంగళూరుకు చెందిన యువతి అనాంబ వెల్లడించింది. తనను ప్రేమ పేరిట వివాహం చేసుకొని ఇప్పుడు తనను కాదంటున్న సతీష్ ఇంటి అనాంబ బుధవారం దీక్షకు దిగిన సంగతి విదితమే. దీక్షకు కూర్చున్న అనాంబతో ఎస్.కోట ఎస్‌ఐ మారూఫ్ చర్చించి బుధవారం రాత్రి స్థానిక పంచాయతీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకునేలా ఒప్పించారు. కాగా న్యాయ పోరాటం కొనసాగిస్తున్న అన్నాంబను తహసీల్దార్ అరుణకుమారి ఆదేశాల మేరకు వీఆర్‌ఓ గణేష్ గురువారం ఆమెను కలిసి పలు వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అన్నాంబ మాట్లాడుతూ తన భర్త సతీష్ వచ్చి భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకువెళ్లే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. తన భర్తపై ఎటువంటి పోలీసు కేసు పెట్టనని చెప్పింది. తనకు గ్రామస్తులు సహకరించినా...లేకున్నా న్యాయ పోరాటం కొనసాగిస్తానని వెల్లడించింది. తన నిజాయితీయే తన ప్రేమను గెలిపిస్తుందని పేర్కొంది. తన భర్త సతీష్ మంచివాడని, అనాథనైన తనను చేరదీసి వివాహం చేసుకోగా ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిళ్ల మేరకే తనను విడిచి వేరొక యువతితో వివాహానికి సిద్ధపడుతున్నాడని అన్నాంబ ఆరోపించింది.