కైలాసగిరిపై గ్యాంగ్‌రేప్‌ యత్నం

Arilova Police Saved Woman From Molestation in Kailasagiri - Sakshi

సకాలంలో స్పందించి యువతిని రక్షించిన పోలీసులు

కైలాసగిరికి ఓ యువకుడితో వెళ్లిన విద్యార్థిని

ఆ యువకుడు, మరో ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచార యత్నం

యువతి కేకలు వేయడంతో రంగంలోకి పోలీసులు

సిబ్బందిని అభినందించిన సీపీ, డీసీపీ

ప్రేమ పేరుతో వల వేశాడు.. షికారుకు వెళ్దామంటూ ముద్దు ముద్దు మాటలతో మభ్యపెట్టాడు. కానీ అతని మాటల వెనుక.. ముద్దుముచ్చట్ల వెనుక చెరబట్టే కీచక పథకం ఉందన్న విషయం తెలియక గుడ్డిగా అతడిని నమ్మి కైలాసగిరిపైకి వెళ్లిన ఆమెకు ఆ కామాంధుడి విషపు ఆలోచనలు తెలిసొచ్చాయి. ఏకాంతం పేరుతో పొదల్లోకి తీసుకెళ్లి ముందుగానే వేసుకున్న ప్లాన్‌ ప్రకారం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతగాడికి ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. రాక్షసంగా తన మీద పడిన వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కేకలు వేసింది. ఆమె అదృష్టం బాగుండి ఆ కేకలు అటుగా వెళ్తున్న పికెట్‌ పోలీసుల చెవిన పడ్డాయి. వెంటనే వారు అక్కడికి చేరుకొని యువతిని రక్షించారు. సామూహిక లైంగిక దాడికి యత్నించిన నలుగురినీ పట్టుకొని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి యువతి మాన, ప్రాణాలను కాపాడిన పోలీసులను నగర పోలీస్‌ కమిషనర్‌ మీనా అభినందించారు.        

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలోని ఓ నర్సింగ్‌ కాలేజీలో చదువుతున్న యువతి(19)ని జోడుగుళ్ళపాలేనికి చెందిన డగోడుపల్లి నరేష్‌ (17) కొన్నాళ్ళుగా ప్రేమ పేరిట వెంటపడుతూ వస్తున్నాడు. ఓసారి సరదాగా కైలాసగిరి వెళ్దామంటూ ఎప్పటి నుంచో అడుగుతుండటంతో కాదనలేక సరే అంది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఇద్దరూ కలిసి కైలాసగిరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉందామంటూ పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళాడు. వెంట తెచ్చుకున్న మద్యం సేవించాడు. తర్వాత ఒక్కసారిగా అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఇంతలో ఆమె ప్రతిఘటించడంతో దగ్గరలోనే ఉన్న ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేశాడు. మల్లె నూకరాజు (17),  గలావిల్లి రమణ(23) గరికిన నూకరాజు(18).. అనే ముగ్గురు అక్కడికి వచ్చారు. నలుగురూ సామూహిక అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా వేసిన కేకలు పక్కనే పికెటింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు వినపడింది. వెంటనే పోలీసులు పొదలోకి వెళ్ళి ఆ యువతిని రక్షించారు. పారిపోతున్న నలుగురు యువకులను వెంటాడి పట్టుకుని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల్లో నరేష్‌ ఐటీఐ చదువుతుండగా, మల్లె నూకరాజు కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. రమణ బైక్‌ మెకానిక్‌ కాగా గరికిన నూకరాజు డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. వీరిలో నరేష్, మల్లెనూకరాజు మైనర్లు కావడం గమనార్హం. నిందితులు అదుపులో ఉన్నారని, విచారణ చేస్తున్నామని,  సమగ్ర వివరాలు గురువారం వెల్లడిస్తామని ఆరిలోవ సీఐ కష్ణ కిషోర్‌కుమార్‌ చెప్పారు.

ఆరిలోవ పోలీసులు భేష్‌.. సీపీ
ఓ యువతి మాన, ప్రాణాలను రక్షించిన ఆరిలోవ పోలీసులను నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా, డీసీపీ రంగారెడ్డి అభినందించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకుంటే మద్యం మత్తులో ఉన్న నిందితులు ఏ అఘాయిత్యానికైనా పాల్పడే ప్రమాదం ఉండేదన్నారు. ఇటీవల ప్రత్యేకించి కైలాసగిరి, తొట్లకొండ, రుషికొండ ప్రాంతాల్లో  పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెంచామని చెప్పారు. ఫలితంగానే ఓ అవాంఛనీయ ఘటనను  అడ్డుకోగలిగామని అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top