అనూష.. ఏమైపోయింది!

Anusha Missing Case Still Mystery In Krishna - Sakshi

ప్రత్యేక బృందాలు గాలించినా దొరకని ఆచూకీ

వీడని బాలిక మిస్సింగ్‌ కేసు మిస్టరీ

పెనమలూరు : యనమలకుదురు గ్రామానికి చెందిన బాలిక అనూష అదృశ్యం మిస్టరీగా ఉండి పోయింది. ఆమె జాడ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు వారం రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ తెలియలేదు. ఘటన వివరాల్లోకి వెళితే.. యనమలకుదురుకు చెందిన నేలటూరి దుర్గ  (36) అపార్టుమెంట్‌లలో పని చేస్తుంటుంది. భర్త నారాయణరావు ఆమెను వదిలేయడంతో కొద్ది కాలంగా మచ్చా దుర్గాప్రసాద్‌ (25) తో కలిసి ఉంటోంది. అయితే దుర్గకు అనూష (15) అనే కుమార్తె ఉంది. ఆమె విజయవాడ మొగల్రాజపురంలో 9వ తరగతి చదువుతోంది. ఆమెను స్కూల్‌ నుంచి తీసుకు వస్తానని దుర్గాప్రసాద్‌ గత నెల 27వ తేదీన బైక్‌పై వెళ్లాడు. అయితే అతను ఇంటికి తిరిగి రాలేదు. అతనితో పాటు అనూష కూడా ఇంటికి రాలేదు. అయితే అతని బైక్, సెల్‌ఫోన్‌ యనమలకుదురు చిన్న వంతెన వద్ద దొరికాయి. ఇద్దరూ ఎటు వెళ్లారో తెలియకపోవడంతో అనూష తల్లి దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.

కాల్వలో దుర్గాప్రసాద్‌ శవం..
కాగా చోడవరం గ్రామ పరిధి కేఈబీ కాల్వలో దుర్గాప్రసాద్‌ శవం లభ్యమైంది. అయితే అనూష ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. దీంతో అనూష జాడ కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. వారు బోట్ల సహాయంతో కాల్వల్లో గాలించారు. అయినా అనూష జాడ తెలియలేదు. ఇప్పటికీ ప్రత్యేక బృందాలు కాల్వ దిగువ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. అయినా, ఆమె ఆచూకీ తెలియడం లేదు.

బాలిక ఏమైనట్లు..?
స్కూల్‌కు వెళ్లిన అనూష తిరిగి ఇంటికి కాకుండా ఏమైపోయిందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఆమెను స్కూల్‌ నుంచి తీసుకు వస్తానని వెళ్లిన దుర్గాప్రసాద్‌ కాల్వలో శవమై కనిపించాడు. అనూష ఎక్కడ ఉంది తెలియడం లేదు. కాల్వలో దుర్గాప్రసాద్‌ శవం దొరకటంతో అనూష కూడా కాల్వలో దూకిందేమోనని పోలీసులు భావిస్తున్నారు. అసలు వీరు కాల్వలో ఎందుకు దూకాల్సి వచ్చిందనే ప్రశ్నకు పోలీసులకు సమాధానం దొరకటం లేదు. ఇప్పటికే అనూష తల్లిని పోలీసులు పలు దఫాలుగా విచారణ చేశారు. ఆమె కూడా ఏమీ చెప్పలేకపోతోంది.

కేసు విచారిస్తున్నాం..
అనూష కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నాం. దుర్గాప్రసాద్‌ శవం కాల్వలో దొరకటంతో అనూష కూడా కాల్వ లో దూకి ఉండవచ్చని వెతుకుతున్నాం. దుర్గాప్రసాద్‌ ఎందుకు చనిపోయాడు, అనూష ఏమైపోయిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.  – దామోదర్, సీఐ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top