రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

Another four remanded in Ramprasad murder case - Sakshi

హైదరాబాద్‌: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త తేలప్రోలు రాంప్రసాద్‌ హత్యకేసులో మంగళవారం మరో నలుగురిని పంజగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు కోగంటి సత్యం, టెక్కెం శ్యామ్‌సుందర్‌ అలియాస్‌ శ్యామ్, బాలనాగ ఆంజనేయప్రసాద్, ఎం.ప్రీతం అలియాస్‌ బాజీ, పులివర్తి రామును సోమవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. రాంప్రసాద్‌ ప్రతి కదలికను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రిక ఆనంద్‌(28), హత్య జరిగిన రోజు అదే ప్రాంతంలో ఉండి ఎవరూ రాకుండా కాపుగాసిన శ్రీరామ్‌ రమేశ్‌(29), షేక్‌ అజారుద్దీన్‌(30), పత్తిపాటి నరేష్‌(28)లను సోమవారంరాత్రి జూబ్లీహిల్స్, అయ్యప్ప సొసైటీలోని కోగంటి సత్యంకు చెందిన గెస్ట్‌హౌస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాంప్రసాద్‌ కదలికలు తెలుసుకునేందుకు ఆనంద్‌ను నియమించిన తిరుపతి సురేశ్, మరో నిందితుడు వెంకట్రాంరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐదో నిందితుడు ఆనంద్‌ నెలరోజులుగా పంజగుట్ట దుర్గానగర్‌లోని ఓ గదిలో ఉంటూ రాంప్రసాద్‌ కదలికలపై నిఘా పెట్టాడు. ఏ సమయంలో ఎక్కడికి వెళుతున్నాడు, పంజగుట్టలోని కార్పొరేట్‌ ఆఫీస్‌కు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళతాడు అనే విషయాలు తెలుసుకుని తిరుపతి సురేశ్‌కు చెప్పేవాడు. సురేశ్‌ ఈ సమాచారాన్ని కోగంటి సత్యంకు చేరవేసేవాడు. ఆనంద్‌ సూచనల మేరకే దుర్గానగర్‌ను హత్యకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు పోలీసులు చెప్పారు. హత్య చేసేందుకు వెళ్లిన నిందితులకు సురేశ్‌ బొలెరో వాహనం సిద్ధం చేశాడు. హత్య అనంతరం నిందితులను అదే వాహనంలో జూబ్లీహిల్స్‌ వరకు తీసుకువెళ్లి పారిపోయేలా చేశాడు. త్వరలోనే సురేశ్‌ను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top