అతని మీదే ఉల్టా చార్జ్‌షీట్‌ వేశారు!

Alwar Mob Lynching Victim Pehlu Khan Charged With Cow Smuggling - Sakshi

న్యూఢిల్లీ: గో రక్షకుల కిరాకత మూక దాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగా రాజస్థాన్‌ పోలీసులు గురువారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్‌ 5,8, 9ల కింద పెహ్లూ ఖాన్‌, అతని కొడుకులపై ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నారంటూ అభియోగాలు నమోదు చేశారు. 

2017 ఏప్రిల్‌ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్‌, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్‌ ప్రాణలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్‌ దాఖలు చేయడంతో పోలీసులు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ వ్యవహారంపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. ‘గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగింది. ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్‌ వేశారు. కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తాం’ అని తెలిపారు. పెహ్లూ ఖాన్‌ కొడుకు ఇర్షాద్‌ (25) మాట్లాడుతూ..‘గో రక్షకుల దాడిలో మా నాన్నను కోల్పోయాం. ఇప్పుడు మామీదే స్మగ్లర్లుగా చార్జ్‌షీట్‌ వేశారు. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో ఈ కేసును సమీక్షించి.. మాపై కేసును ఎత్తివేస్తారని భావించాం. ప్రభుత్వం మారడంతో న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ అలా జరగడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top