
అలహాబాద్: తమను తాము భగవంతుని అవతారం చెప్పుకునే నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత అఖార పరిషద్ కోరింది. దేశంలో 17 మంది నకిలీ బాబాలు ఉన్నారని పేర్కొంటూ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, రాధేమా, నిర్మల్ బాబా, రాంపాల్, ఆశారామ్ బాపు సహా 14 మంది పేర్లతో సెప్టెంబర్‌లో మొదటి లిస్ట్ తయారు చేసింది.
మరో ముగ్గురి పేర్లను జతచేసి తాజా జాబితా విడుదల చేసింది. వీరేంద్ర దేవ్ దీక్షిత్(ఢిల్లీ), సచిదానంద సరస్వతి(యూపీ), త్రికాల్ భవంత్(అలహాబాద్) పేర్లను జోడించింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో వీరేంద్ర దేవ్ నిర్వహిస్తున్న మూడు ఆశ్రమాల నుంచి గతవారం 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను పోలీసులు కాపాడారు.
దొంగ బాబాల గురించి సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు ఈ జాబితా తయారుచేసినట్టు అఖిల భారత అఖార పరిషద్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి తెలిపారు. సాధువులు, సన్యాసులకు చెడ్డపేరు తీసుకువస్తున్న నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.