ఏసీబీకి చిక్కిన కానిస్టేబుళ్లు

Airport Constables Caught Bribery Demand in Visakhapatnam - Sakshi

రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కానిస్టేబుల్‌ బంగారునాయుడు, రైటర్‌ మహంతి శ్రీనివాసరావు

సీఐ తీసుకోమంటే తీసుకున్నామని చెప్పిన కానిస్టేబుళ్లు

ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంచలనం

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమ): రక్షక భటులు భక్షక భటులుగా మారిపోతున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా బాధితుల నుంచి దోచుకునేందుకు వెనుకాడడం లేదు. ఇందుకు మంగళవారం ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్లో వెలుగుచూసిన ఘటనే నిదర్శనం. కేసు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని ఆనంద్‌ అనే వ్యక్తిని బెదిరించి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్‌ బంగారు నాయుడు, రైటర్‌ మహంతి శ్రీనువాసరావులను ఏసీబీ అధికారులు రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎస్‌.రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల గోంగూర హోటల్‌ వద్ద ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆనంద్‌ కుమార్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఆనంద్‌కుమార్‌పై స్టీల్‌ప్లాంట్‌లో చీటింగ్‌ కేసులున్నాయి.

అక్కడి వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఫిర్యాదు ఉంది. దీనిపై గోంగూర హోటల్‌ వద్ద గొడవ జరిగింది. అయితే ఆనంద్‌కుమార్‌పై ఇక్కడ కూడా కేసులు పెడతామని ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ పోలీసులు బెదిరించారు. కేసులు పెట్టకుండా ఉండాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మే 31న రూ.15వేలు ఆనంద్‌ ఇచ్చాడు. మిగిలిన రూ.15వేలు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాలిక ప్రకారం ఏసీబీ అధికారులు సమకూర్చిన రూ.15వేలును కానిస్టేబుల్‌ బంగారు నాయుడుకు ఆనంద్‌ ఇచ్చాడు. ఆ సొమ్మును రైటర్‌ శ్రీనుకి బంగారునాయుడు ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై విచారించగా సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు చెప్పిన ప్రకారమే డబ్బులు తీసుకున్నామని మహంతి శ్రీను, బంగారునాయుడు చెబుతున్నారు. సీఐ ప్రమేయంపై విచారణ చేపడుతున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరినీ అరెస్ట్‌ చేశామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top