ఏసీబీ వలలో టీయూఎఫ్‌ఐడీసీ ఇంజనీర్‌

ACB Traps TUFIDC Engineer In Hyderabad - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్‌ఐడీసీ) ఇంజనీర్‌గా పనిచేస్తోన్న ప్రవీణ్‌ చంద్రను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌కు రావలసిన నిధుల విడుదలకు లంచం వసూలు చేసినందుకు గానూ అదుపులోకి తీసుకున్నారు. వనపర్తిలో కాంట్రాక్టర్‌ కాంతారెడ్డి 2008 సంవత్సరంలో రూ.14.32 కోట్ల విలువైన సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల పనులను ప్రారంభించి 2010లో పూర్తి చేశారు.  ఆ పనులకు సంబంధించి రూ.13 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో రూ.1.32 కోట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. ఆయన మరోసారి అభ్యర్థించగా మేలో నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

వాటి విడుదల అధికారం ప్రవీణ్‌ చంద్రకు ఉంది. తనకు రూ.10 లక్షలు లంచం ఇస్తేనే నిధులు వస్తాయంటూ మెలిక పెట్టారు. రూ.3 లక్షలు ఇవ్వగలనని కాంట్రాక్టర్‌ బేరమాడి సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. ఫోన్‌ చేసి రూ.2 లక్షలు ఇస్తానని, నిధులు విడుదలైన తర్వాత మరో లక్ష ఇస్తానని కాంట్రాక్టర్‌, ఇంజనీర్‌కు చెప్పారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.2 లక్షలు తీసుకుని మాసాబ్‌ ట్యాంక్‌కు వెళ్లారు. ఆ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రవీణ్‌ చంద్రను అక్కడికక్కడే పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మసాబ్‌ ట్యాంక్‌లోని ప్రవీణ్‌ కార్యాలయంలో దాడులు కొనసాగిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top