మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా | ACB is looking into the role of Pitani Satyanarayana in ESI Scam Case | Sakshi
Sakshi News home page

మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా

Jul 15 2020 4:42 AM | Updated on Jul 15 2020 4:53 AM

ACB is looking into the role of Pitani Satyanarayana in ESI Scam Case - Sakshi

సాక్షి, అమరావతి:  టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్‌ఐ భారీ స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్‌ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్‌ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్,  వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్‌ చేసింది.  

పితాని హయాంలోనూ అవే అక్రమాలు 
► పితాని మంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ అవే అక్రమాలు, అవకతవకలు కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది.  
► పితానికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మురళీమోహన్, పితాని కుమారుడు వెంకట సురేష్‌లను నిందితులుగా చేర్చింది.  
► హైదరాబాద్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఈఎస్‌ఐ అధికారులకు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా తన హయాంలో లావాదేవీలు జరగలేదని, ఆ తర్వాతే జరిగాయని ఏసీబీ విచారణలో స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు తన తర్వాత పితాని ప్రమేయాన్ని చెప్పకనే చెప్పినట్టయ్యింది. 
► తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్‌ కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపారని,  బిల్లులు చెల్లింపులు వంటి అంశాలపై సురేష్‌ నేరుగా అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 
► ఇందుకు సంబంధించి పితాని కుమారుడి ఫోన్‌ కాల్స్‌ డేటాను విశ్లేషిస్తున్నట్టు సమాచారం.  
► పితాని వ్యక్తిగత కార్యదర్శిని ఇప్పటికే అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. 
► పితాని కుమారుడు, అతడి మాజీ పీఎస్‌ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించగా.. హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో పితాని కుమారుడిని అరెస్ట్‌ చేసేందుకు ఏసీబీ బృందాలు పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల, భీమవరం, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో గాలింపు ముమ్మరం చేశాయి.

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా 
ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం అచ్చెన్నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ అధికారులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించకుండానే అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేశారని చెప్పారు. ఇలాంటప్పుడు బెయిల్‌ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఆ తీర్పు కాపీలు న్యాయమూర్తి ముందు లేకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement