ఏజెన్సీలో ఉగ్రమూలాలు!

The abyss of the agency! - Sakshi

మత ప్రచారం పేరుతో వక్రమార్గం 

జమ్ముకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో అశ్వాపురం యువకుడి మృతి

ఏజెన్సీలో కదలికలపై  నిఘా వైఫల్యం

ఆందోళన చెందుతున్న  జిల్లా వాసులు

మణుగూరు  : మావోయిస్టు æప్రభావిత ప్రాంతంగా పేరున్న మణుగూరు సబ్‌ డివిజన్‌లో గత సంవత్సర కాలంలో ఉగ్రవాద మూలాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఈ ప్రాంత వాసులకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర పోలీసులు గుర్తించడం గమనార్హం. ఈనెల 12న రాత్రి జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో  మృతి చెందిన ముగ్గుగూ తమ సంస్థకు చెందిన వారేనని అన్సార్‌ గజ్వతుల్‌ హింద్‌(ఏజీòహెచ్‌) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఈ ముగ్గురిలో ఒకరు అశ్వాపురానికి  చెందిన యువకుడు మహ్మద్‌ తౌఫిక్‌(27) కావడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ వార్త మణుగూరు సబ్‌డివిజన్‌లో సంచలనం రేకెత్తించింది. తౌఫిక్‌ అశ్వాపురంలోని భారజల కర్మాగార ఉద్యోగి రజాక్‌ చిన్న కుమారుడిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో యువత ఉగ్రవాద భావాలపై మొగ్గు చూపుతున్నట్లు మరోసారి రుజువైంది.
 
సబ్‌డివిజన్‌లో పెరుగుతున్న ఉగ్రభావాలు 
మణుగూరు సబ్‌ డివిజన్‌లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, పరిచయాలు ఎక్కువగా కలిగిన వ్యక్తులు క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. 5 నెలల క్రితం మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న సోమేశ్వరరావు అనే మత ప్రవక్తను హైదరాబాద్‌ పోలీసులు రామానుజవరం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది.  

తీవ్రవాదిగా మారిన యువకుడు... 
మహ్మద్‌ తౌఫిక్‌ హెవీ వాటర్‌ప్లాంట్‌ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. డిప్లొమా  చదివేందుకు వనపర్తి వెళ్లి.. మధ్యలోనే చదువు మానేసి వచ్చాడు. ఆ తర్వాత అశ్వాపురంలోనే ఉంటూ దొంగతనాలు చేస్తూ 2009లో పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత కాలనీలో ఆకతాయిలతో కలిసి పలు అల్లర్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. 2016 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే చదువుకుంటున్నట్లు తల్లిదండ్రులను నమ్మించాడు. ఈ క్రమంలో తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పడ్డాయి. కాగా, తౌఫిక్‌ అన్సార్‌ గజ్వతుల్‌ హింద్‌ అనే తీవ్రవాద సంస్థలో కీలకంగా పనిచేశాడని ఎన్‌కౌంటర్‌ అనంతరం వెలుగులోకి వచ్చింది. తన కొడుకు సమాజంలో పరువుపోయే పని చేశాడని, వాడి శవం కూడా తనకు వద్దని మృతుని తండ్రి రజాక్‌ ‘సాక్షి’కి తెలిపారు.  
 
మణుగూరు సబ్‌డివిజన్‌పై పెరిగిన నిఘా
తీవ్రవాద భావాలు గల వ్యక్తులు మణుగూరు సబ్‌ డివిజన్‌లో పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్‌ పోలీసులు ఇక్కడి తీవ్రవాద మూలాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మహ్మద్‌ తౌఫిక్‌ కదలికలపై ముందుగానే సమాచారం తెలుసుకొని అతనిపై నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతడి ఆచూకీ కోసం 3 నెలల క్రితం కేంద్ర ఇంటెలిజెన్స్‌ పోలీసులు అశ్వాపురం హెవీవాటర్‌ ప్లాంట్‌లో, సెక్యూరిటీలో, అశ్వాపురం పట్టణలో పలు వివరాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. తౌఫిక్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు, స్నేహితులు, అతనితో కలిసి సోషల్‌ మీడియాలో భావాలు పంచుకున్న వ్యక్తులపై కూడా కేంద్ర ఇంటెలిజెన్స్‌ పోలీసులు, రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు.

ఇలా చేస్తాడని ఊహించలేదు : మహ్మద్‌ రజాక్, తౌఫిక్‌ తండ్రి  
తౌఫీక్‌ మృతిపై అతడి తండ్రి రజాక్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా తన కుమారుడు ఇలా చేస్తాడని అనుకోలేదని అన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు జాబ్‌ చేస్తున్నానని చెప్పాడని, వ్యాపారం చేస్తానంటూ ఆరు నెలల క్రితం రూ.30,000 తీసుకెళ్లాడని తెలిపారు. తన కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. అతడి మృతదేహానికి తనకు ఏ సంబంధం లేదని చెప్పారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top