కార్లు, గోడలు, పోస్ట్‌బాక్స్‌లపై ప్రత్యక్షమైన నిషేధిత గుర్తు
ఉలిక్కిపడిన హనావూ నగరవాసులు
హనావూ: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పాలనాకాలంలో యూదుల ఊచకోత చరిత్రలో ఎంతటి చీకటి అధ్యాయంగా మారిందో స్వస్తికా గుర్తు సైతం అంతటి చెడ్డ పేరు తెచ్చుకుంది. హిట్లర్ నాజీ సైనికులు ధరించిన ఈ స్వస్తికా గుర్తు తాజాగా జర్మనీలోని హనావూ నగరంలో పలు చోట్ల ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. మనిషి రక్తంతో కార్లు, గోడలు, పోస్ట్‌బాక్స్‌లపై స్వస్తికా చిహ్నం కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదుతో ఎట్టకేలకు ఒక అనుమానితుడిని అరెస్ట్‌చేశారు.
అతని మానసిక స్థితి సరిగా లేదని, సొంత రక్తంతోనే ఇవన్నీ రాసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో అసలు కారణాలు బయటికొస్తాయని పోలీస్ అధికారి థామస్ లీపోల్డ్ చెప్పారు. చట్టవ్యతిరేక సంఘాలతో ఇతనికి భాగస్వామ్యం ఉందా అనే కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడిని 31 ఏళ్ల రొమేనియా దేశస్తుడిగా గుర్తించారు. అతనిని నివాసంలో పోలీసులు అరెస్ట్‌చేసినప్పుడు పూటుగా తాగి ఉన్నాడని తెలుస్తోంది. యూదులపై విద్వేషానికి గుర్తుగా అప్పట్లో హిట్లర్ సైన్యం ఈ గుర్తును తమ యూనిఫామ్‌లపై ధరించేవాళ్లు.


