భద్రత కావాలి : జైలు నుంచి తల్వార్‌ దంపతుల విడుదల

Aarushi Murder Case: Talwar couple released from Dasna jail

సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి, హేమ్‌రాజ్‌ల హత్య కేసులో గడిచిన నాలుగేళ్లుగా శిక్ష అనుభవించిన రాజేశ్‌ తల్వార్‌, ఆయన భార్య నుపుర్‌ తల్వార్‌లు సోమవారం సాయంత్రం ఘజియాబాద్‌ దస్నా జైలు నుంచి విడుదలయ్యారు. జంటహత్య కేసులో వీరికి సీబీఐ కోర్డు విధించిన జీవితఖైదును అలహాబాద్‌ హైకోర్టు గత వారం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వరుస సెలవుల కారణంగా వారి విడుదల మూడు రోజులు ఆలస్యమైంది.

మాకు భద్రత కల్పించండి : జైలు నుంచి విడుదలైన తర్వాత తమపై ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్న కారణంగా పోలీస్‌ భద్రత కల్పించాలని తల్వార్‌ దంపతులు కోరినట్లు వారి తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో అలహాబాద్‌ కోర్టు ప్రాంగణంలో రాజేశ్‌ తల్వార్‌పై కొందరు దాడికి పాల్పడిన నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  

జైలు నుంచి ఆలయానికి! : ఆరుషి-హేమ్‌రాజ్‌ల హత్య మొదలు ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్వార్‌ దంపతుల విడుదల సందర్భంగా దస్పా జైలు వెలువల మీడియా కోలాహలం నెలకొంది. తల్వార్‌ దంపతులు జైలు నుంచి నేరుగా నోయిడాలోని సాయిబాబా ఆలయానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఆ ఇంటికి మాత్రం ఇప్పుడే కాదు : తమ కూతురు ఆరుషి, పనిమనిషి హేమ్‌రాజ్‌ హత్య జరిగిన ఇంటికి తల్వార్‌ దంపతులు ఇప్పుడప్పుడే వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ ఇంట్లో వేరేవాళ్లు అద్దెకుంటున్నారు. జల్‌వాయి విహార్‌లోని నుపుర్‌ తల్లిదండ్రుల ఇంట్లోనే కొన్నాళ్లు ఉండనున్నట్లు తర్వాల్‌ బంధువులు పేర్కొన్నారు.

జైలులో సంపాదించిన రూ. 49,500 తీసుకోకుండానే.. : ప్రొఫెషనల్‌ డెంటిస్టులైన రాజేశ్‌, నుపుర్‌ తర్వార్‌లు తమ శిక్షా కాలంలో జైలు ఖైదీలు, సిబ్బంది, అధికారులకు వైద్యం చేశారు. ఇందుకుగానూ వారికి రూ.49,500 ఫీజుగా అందాల్సిఉందని, అయితే ఆ మొత్తాన్ని తీసుకునేందుకు తల్వార్‌ దంపతులు నిరాకరించారని దస్నా జైలర్‌ మయూరా చెప్పారు. విడుదలైన తర్వాత కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి జైలుకు వెళ్లి వైద్యం చేయాలని వైద్యదంపతులు నిర్ణయం తీసుకున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top