కామాంధుడి చేతిలో వృద్ధురాలి బలి.. | 90 Years Old Woman Molested And Homicides In Nalgonda | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై లైంగిక దాడి.. ఆపై హత్య

Mar 5 2020 10:12 AM | Updated on Mar 5 2020 10:15 AM

90 Years Old Woman Molested And Homicides In Nalgonda  - Sakshi

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్‌

సాక్షి, హాలియా(నల్గొండ) : కామాంధుడి చేతిలో 90 ఏళ్ల వృద్ధురాలు బలైంది. అనుముల మండలంలోని మారేపల్లి గ్రామంలో ఇటీవల వెలుగు చూసిన వృద్ధురాలిపై లైంగికదాడి, హత్య చేసిన కేసు మిస్టరీని హాలియా పోలీసులు చేధించారు. వృద్దురాలిపై ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని బుధవారం హాలియా సీఐ కార్యాలయంలో సీఐ చంద్రశేఖర్‌ మీడియా ఎదుట ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడించారు. అనుముల మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలికి నలుగురు కుమారులు. వారికి వివాహాలై వేరుగా ఉంటున్నారు. భర్త చనిపోవడంతో వృద్ధురాలు గ్రామ శివారులోని రేకుల గదిలో ఒంటరిగా నివాసం ఉంటున్న విషయాన్ని పసిగట్టిన అదే గ్రామానికి చెందిన సత్రశాల శంకర్‌(22) వృద్ధురాలిని అనుభవించాలని నిర్ణయించుకున్నాడు.

ఫిబ్రవరి 29న మధ్యాహ్నం శంకర్‌ గ్రామ శివారులోని వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఏమి అవ్వా బాగున్నావా అంటూ పలకరించాడు. ఆ సమయంలో వృద్ధురాలి ఇంటి సమీపంలో కొంతమంది ఇరుగుపొరుగు వారు ఉండడంతో శంకర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం 5 గంటల సమయంలో మరోసారి వృద్ధురాలి ఇంటి వైపు శంకర్‌ నడుకుంటూ వెళ్తుండగా వృద్ధురాలు తన ఇంటి ముందు కూర్చున్న విషయాన్ని గమనించి పలకరించడానికి దగ్గరకు వెళ్లిన శంకర్‌ ఆమె తొడపై చెయ్యి వేయడంతో ఆమె అతడిని తీవ్రంగా మందలించింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి చీకటి పడే వరకు వేచి చూసిన శంకర్‌ గ్రామంలోని దాసరి శ్రీను ఇంటికి వెళ్లి క్వాటర్‌ మద్యం తీసుకుని సేవించాడు. రాత్రి ఒంటరిగా నివాసం ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. రేకుల ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఆమెపై పడుకున్నాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో నోరు, ముక్కు మూసి లైంగికదాడికి పాల్పడాడు. అనంతరం ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వృద్ధురాలి మృతిపై అనుమానం కలిగిన ఆమె కుమారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

కేసు చేధించారు ఇలా..
వృద్ధురాలిపై అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. బుధవారం నిడమనూరు మండలంలోని కోటమైసమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న శంకర్‌ను పోలీసులు పట్టుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. కేసును చేధించిన హాలియా సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ వీర రాఘవులు, కానిస్టేబుల్స్‌ విజయ్, శేఖర్, రామారావును జిల్లా పోలీస్‌  అధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement