11మంది చిన్నారులకు విముక్తి   | 11 Children Are Freed | Sakshi
Sakshi News home page

11మంది చిన్నారులకు విముక్తి  

Aug 1 2018 3:15 PM | Updated on Oct 4 2018 8:29 PM

11 Children Are Freed - Sakshi

రిమాండ్‌లో ఉన్న వ్యభిచారగకృహ నిర్వాహకులు 

యాదగిరిగుట్ట(ఆలేరు) : బాలికల అక్రమ రవాణాలో 8మంది వ్యభిచార గృహా నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బాలికల అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యాదగిరిగుట్టలో  వ్యభిచారగృహాల నుంచి 11మంది చిన్నారులకు విముక్తి కల్పించి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించామన్నారు.

 జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ఈనెల 30న యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో ఓ అమ్మాయిని తల్లి చిత్రహింసలకు గురి చేస్తుందని స్థానికులు కొందరు షీటీం, ఐసీడీఎస్, ఎస్‌ఓటీ, చైల్డ్‌లైన్, పోలీస్‌లకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కంసాని కల్యాణి ఇంటిపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఉంటున్న అనిత, సుశీల, నర్సింహ, శృతి, సరిత, వాణి, వంశీలు ఇతర ప్రాంతాల్లో ఉన్న మూడు నుంచి 5 సంవత్సాల పిల్లలను కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు కల్యాణి చెప్పారని తెలిపారు. వారి ఇళ్లలో దాడులు నిర్వహించి 11 మంది చిన్నారులకు విముక్తి కల్పించామన్నారు.

పిల్లలను విచారించిన తర్వాత వారు సొంత పిల్లలుకాదని, రైల్వే ఫ్లాట్‌ పాం, జనవాసాల్లో చాక్లెట్లు ఇస్తామని తీసుకువచ్చారని తెలిసిందన్నారు. చిన్నారులను ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచార గృహాల్లో ఉన్న మహిళలకు రూ.లక్షకు అమ్ముతున్నారని తెలిసిందన్నారు.

గతంలో 5మందిపై పీడీ యాక్టులు పెట్టామని తెలిపారు. ఇందులో కంసాని యాదగిరి అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉందని తెలిసిందన్నారు. చిన్నారులను అక్రమంగా కొనుగోలు చేసిన  8మంది ఇళ్లను సీజ్‌ చేయాలని ఆర్డీఓను కోరతామన్నారు. 

శారీరకంగా ఎదిగేందుకు ఇంజక్షన్లు...

అక్రమంగా కొనుగోలు చేసిన చిన్నారులు 12 సంవత్సరాలు దాటిన తర్వాత తొందరగా శారీరకంగా ఎదిగే విధంగా ఓ ప్రైవేట్‌ డాక్టర్‌తో కలిసి హర్మోన్‌గ్రోత్‌కు సంబంధించిన ఈస్ట్రోజన్‌ అనే ఇంజక్షన్‌ను ఇప్పిస్తున్నారని తెలిపారు.  ఇంజక్షన్లు ఇవ్వడంతో మైనర్లుగా ఉన్న బాలికలను వ్యభిచార కుంపిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అక్రమ రవాణాను నిలుపుదలకు కృషి..

గత రెండేళ్ల కాలంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో అక్రమ చిన్నారులు, మహిళలు, అమ్మాయిల రవాణ జరగకుండా, వ్యభిచారం నిర్వహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. ఇప్పటి వరకు 170 అక్రమ రవాణ కేసులు, 341 ఆర్గనైజర్లను, 208 మంది కస్టమర్లను అరెస్టు చేశామన్నారు. 268 మంది మహిళలను, చిన్నారులను రక్షించామని, 68 వ్యభిచార గృహాలను సీజ్‌ చేశామని చెప్పారు.

మార్పు రానందుకే పీడీ యాక్టు..

పట్టణంలోని  గణేష్‌ నగర్‌లో చేస్తున్న వ్యభి చారవృత్తిని మాన్పించేందుకే గత కొన్నేళ్లుగా నిర్వాహకులకు, యువతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తు, పునారావసం కల్పిస్తున్నామన్నారు. అయిన వారిలో మార్పు రాకపోవడంతో ఇటీవల 5గురిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు.

పలువురికి రివార్డులు..

చిన్నారుల అక్రమ రవాణా నుంచి 11మందికి విముక్తి కలిగించినందుకు షీటీం, ఐసీడీఎస్, పోలీస్‌ శాఖల అధికారులకు సీపీ మహేష్‌భగవత్‌ రివార్డులను అందజేశారు. అందులో షీటీం ఎస్‌ఐ వీరభద్రయ్య, ఏఎస్‌ఐ కిష్టయ్య, పీసీ అనిల్, డబ్ల్యూహెచ్‌ రమ, హోంగార్డు నరేష్, ఎస్‌లోటీ ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్, రూరల్‌ సీఐ ఆంజనేయులు, టౌన్‌ సీఐ అశోక్‌కుమార్, ఏఎస్‌ఐ సోమయ్య, ముఖేష్, హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్, పీసీ శ్రీను, ఐసీడీఎస్‌ సీడీపీఓ చంద్రకళ, చైల్డ్‌లైన్‌ కో కన్వీనర్‌ రోహితలతో పాటు పలువురికి రివార్డును అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీ రాం చంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి శారద, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ప్రతినిధి నిమ్మయ్య, ఏసీపీ శ్రీనివాసచార్యులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement