దోపిడీ టాకీస్‌! | దోపిడీ టాకీస్‌!  | Sakshi
Sakshi News home page

దోపిడీ టాకీస్‌!

Oct 20 2018 10:06 AM | Updated on Oct 20 2018 10:06 AM

దోపిడీ టాకీస్‌!  - Sakshi

కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌(పేరుమార్చాం) దసరా సెలువులకు కాస్త విశ్రాంతి దొరికిందని శుక్రవారం నగరంలోని ఓ ప్రముఖ సినిమాహాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లాడు. బైక్‌ను పార్కింగ్‌స్థలంలో నిలిపి లోపలికి వెళ్తుండగా.. నిర్వాహకులు అడ్డుకున్నారు. ‘మీ బైక్‌కు పార్కింగ్‌ రుసుం చెల్లించాలి’ అని రశీదు చించి ఇచ్చారు. ఆశ్చర్యానికి గురైన శ్రీనివాస్‌ ‘ సుప్రీంకోర్టు పార్కింగ్‌ రుసుం వసూలు చెయొద్దంది కదా..?’ అని నిలదీశాడు. దానికి ‘ఇక్కడ వసూలు చేస్తాం. మాకు రూల్స్‌ వర్తించవు.. రుసుం కట్టే వెళ్లండి’ అని సినిమాహాల్‌ నిర్వాహకులు హుకుం జారీ చేశారు. ససేమీర అన్న శ్రీనివాస్‌పై ఒకింత దాడికి దిగారు. కోపోద్రిక్తుడైన శ్రీనివాస్‌ ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని అక్కడి నుంచి వెళ్లాడు.

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పలు సిని మాహాళ్లలో నిర్వాహకులు ‘అంతా తమ ఇష్టం’గా వ్యవహరిస్తున్నారని సినిమాకు వెళ్లే ప్రేక్షకులు అంటున్నారు. నిత్యం ఉద్యోగ, వ్యాపారాలతో బిజీగా గడిపి... ఖాళీ సమయంలో కాస్త విశ్రాంతి కోసం సినిమా చూసేందుకు హాల్‌కు వెళ్తే.... నిలువుదోపిడీకి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. బైక్‌పై వెళ్తే.. బండి లోపల పెట్టింది మొదలు... క్యాంటీన్‌లో కూడా అధిక ధరలకు తినుబండారాత విక్రయాలు చేస్తున్నారని, హాల్‌ ఆవరణలో కనీస భద్రతాచర్యలు కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని నిలదీస్తే... దాడులకు సైతం దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

పార్కింగ్‌ ఫీజు వసూలు..
సినిమా థియేటర్లలలో పార్కింగ్‌ఫీజు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, అప్పటి నగరపాలక కమిషనర్‌ శశాంకాలు నగరంలో ఉన్న సినిమాహాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దీంతో పాటు  ప్రతీ థియేటర్లో నాణ్యమైన మెటల్‌ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే థియేటర్లకు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

ఆదేశాలు బేఖాతర్‌..
ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ నగరంలోని పలు సినిమాహాళ్ల నిర్వాహకులు నిబంధనలను పెడ చెవిన పెడుతున్నారు. అడ్డగోలుగా పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తున్నారు. సినిమాకు వచ్చే ప్రేక్షకులకు సరైన వసతులు కల్పించడం లేదు. నాసిరకమైన ఫుడ్‌ అందుబాటులో ఉంచుతున్నారు. దాన్నీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో పలు థియేటర్ల క్యాంటీన్లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించినా... పద్ధతిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.

ప్రశ్నిస్తే.. దాడులే..
నగర నడిఒడ్డున ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన సినిమాహాల్‌ నిర్వాహకులు సినిమాకు వచ్చేవారిపట్ల రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ తహసీల్దార్‌ సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లాడు. నిర్వాహకులు పార్కింగ్‌ ఫీజు అడిగారు. పార్కింగ్‌ ఫీజు వసూలు చేయెద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందని, ఫీజు కట్టనని చెప్పిన పాపానికి అతడిపై దాడికి యత్నించారు. నెట్టివేసి అవమానకరంగా మాట్లాడారు. ఈ విషయమై సదరు తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా... వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఓ ఉన్నతాధికారికే న్యాయం జరగలేదంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ థియేటర్లో జరిగే అన్యాయాలను గురించి ప్రశ్నిస్తే... పట్టించునే వారే కరువయ్యారని శుక్రవారం సైతం దాడికి గురైన వ్యక్తి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు
సినిమాహళ్లలో నిబంధనలు అతిక్రమించే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సినిమాకు వచ్చే ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధితశాఖతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సినిమాహళ్లలో పార్కింగ్‌ఫీజు విషయంలో నిబంధనల ప్రకారం, భద్రత ప్రమాణాలు పాటించని వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలుకు పూనుకుంటాం.– తుల శ్రీనివాసరావు, వన్‌టౌన్‌ సీఐ, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement