
ఆందోళనకారులకు నచ్చజెప్పుతున్న ఎస్‌ఐ అయోధ్య
శాలిగౌరారం : బ్యాంకు సిబ్బంది దూషించారంటూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలకేంద్రంలో శుక్రవారం జరిగింది. అంబారిపేటకు చెందిన మొలుగూరి రమేశ్ స్థానికంగా ఉన్న పెట్రోల్‌బంక్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అంబారిపేటకు చెందిన నక్కల ప్రవీణ్, అడ్లూరుకు చెందిన బోడ దానయ్యలు స్థానిక ఎస్‌బీఐ నుంచి గత సంవత్సరం ‘ముద్ర’ పథకంలో భాగంగా ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు పొందారు. ఆ ఇద్దరికి రమేశ్ జామీనుగా ఉన్నాడు. వారు రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో జామీనుగా ఉన్న రమేశ్‌పై బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో రమేశ్ తన భార్యమీద ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ప్రవీణ్ పేరున ఉన్న అప్పులో రూ.16 వేలు చెల్లించాడు. అనంతరం దానయ్య కూడా రూ.20వేలు చెల్లించాడు. ప్రవీణ్ అప్పు చెల్లింపు తక్కువగా జరగడంతో 20 రోజుల క్రితం మరోమారు జామీనుగా ఉన్న రమేశ్ వద్దకు వెళ్లిన మేనేజర్.. రమేశ్ సెల్‌ఫోన్‌ను తీసుకొచ్చాడు. ఇంతలో ప్రవీణ్ భార్య సభ్యురాలుగా ఉన్న సమభావనా సంఘానికి ఇదే బ్యాంక్‌నుంచి రుణం మంజూరు కావడంతో ప్రవీణ్ భార్య వాటాకు వచ్చిన రూ.31 వేల మొత్తాన్ని తిరిగి శుక్రవారం చెల్లించాడు. దీంతో నా సెల్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని జామీనుగా ఉన్న రమేశ్ బ్యాంకు మేనేజర్‌ను కోరాడు.
దానయ్య అప్పుకూడా చెల్లించిన తర్వాతే సెల్‌ఫోన్ ఇస్తానని చెప్పడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన రమేశ్ అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన మాగి రవికి జరిగిన విషయాన్ని తెలి పాడు. దీంతో ఇద్దరు కలిసి సాయంత్రం బ్యాం కుకు వెళ్లి మేనేజర్‌తో సెల్‌ఫోన్ విషయం మాట్లాడుతుండగా బ్యాంకు సిబ్బంది ఒకరు రవి పట్ల దురుసుగా మాట్లాడి దూషించాడు. దీంతో అవమానానికి గురైన మాగి రవి బ్యాంకు ఎదుట ఒంటిపై పెట్రోల్‌పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనిం చిన సమీప వ్యక్తులు రవిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ మధుసూధన్‌రెడ్డి బయటకు వచ్చి రవిపై నీళ్లుపోశారు. కొంతమంది రవికి మద్దతుగా నిలవడంతో బ్యాంకుగేటు ఎదుట బైఠాయించారు. ఎస్‌ఐ అయోధ్య సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వారు ససేమిరా అన్నారు. దీంతో బ్యాంకు మేనేజర్ జరిగిన సంఘటన పట్ల ప్రజల ముందు బహిరంగ క్షమాపణ కోరాడు. అనంతరం ధర్నాను ఉపసంహరించిన బాధితుడు బ్యాంకు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనేజర్ మధుసూధన్‌రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్లు వరుణ్‌గుప్త, ప్రతాప్‌లపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.