
యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఫలహారి బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.
జైపూర్: యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఫలహారి బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. విరాళం ఇచ్చేందుకు వచ్చిన తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై 376, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ ప్రకాష్ తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫలాహారీ బాబాను విచారించేందుకు వెళ్లగా.. ఆయన అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బాబాను అల్వార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండటంతో అతడిని అరెస్టు చేశారు.
కేవలం పండ్లను మాత్రమే తినే కౌశలేంద్ర ప్రపన్నాచార్య ఫలహారి(70) మహారాజ్‌గా రాజస్థాన్‌లో బాగా ఫేమస్. ఆయనకు దేశ, విదేశాల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆయన ఆశీర్వాదం కోసం ప్రముఖులు సైతం బారులు తీరుతారు. అలాంటి ఫలహారీ బాబాపై ఓ యువతి తన పై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబాను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 7వ తేదిన తన గదికి పిలిపించుకున్న బాబా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. గత పదిహేనేళ్లుగా తమ కుటుంబ సభ్యులు ఫలహారి బాబాకు భక్తులుగా ఉన్నామని.. బాబాకు విరాళం ఇవ్వడానికి వచ్చినప్పుడే ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపింది. దీంతో ఆమెను బాబా ఆశ్రమానికి తీసుకొచ్చిన పోలీసులు ఏ గదిలో ఈ ఘటన జరిగిందనే అంశంపై విచారణ చేపట్టారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో ఇటీవల డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.