కారు.. జీరో | zero sales on automobile industry on this april 2020 | Sakshi
Sakshi News home page

కారు.. జీరో

May 2 2020 3:00 AM | Updated on May 2 2020 4:39 AM

zero sales on automobile industry on this april 2020 - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలైంది. చరిత్రలో మొదటిసారి.. ఏప్రిల్‌ మాసంలో దేశీయ మార్కెట్లో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహన సంస్థలు ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేని పరిస్థితిని చూశాయి. కాకపోతే కొన్ని వాహనాలను మాత్రం ఎగుమతి చేయగలిగాయి. కార్ల మార్కెట్లో దిగ్గజ సంస్థలు మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ), హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) కంపెనీలు ఒక్క వాహనాన్ని కూడా ఏప్రిల్‌లో విక్రయించలేదని ప్రకటించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఉత్పత్తితోపాటు, విక్రయాలకు బ్రేక్‌ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
అదే విధంగా ఎంజీ మోటార్‌ ఇండియా, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం), ద్విచక్ర వాహన కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (ఐచర్‌ మోటార్స్‌ అనుబంధ సంస్థ) సైతం దేశీయంగా విక్రయాలు సున్నాగానే ఉన్నాయని ప్రకటించాయి. ఇక మహీంద్రా అండ్‌ మహీంద్రా సైతం కార్లు, వాణిజ్య వాహన విభాగంలో దేశీయంగా ఒక్క యూనిట్‌ విక్రయాన్ని కూడా నమోదు చేయలేదు. కాకపోతే విదేశీ మార్కెట్లలో ఈ సంస్థలు కొన్ని వాహనాలను విక్రయించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్, ఎంఅండ్‌ఎం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎగుమతి చేసిన వాటిల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ పరిస్థితులు లేకపోవడం వీటికి కలిసొచ్చింది.


పునఃప్రారంభానికి సిద్ధం..: గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించడంతో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ కంపెనీలు ఈ దిశగా సన్నద్ధం అవుతున్నాయి. ఏప్రిల్‌ చివరి వారం లో గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ లో ఎంజీ మోటార్‌ ఇండియా తయారీని ఆరంభించింది. కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు టీకేఎం తెలిపింది.

ఎన్నో సవాళ్లు: టయోటా
వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్‌ తక్కువ స్థాయిలో ఉండడం, దెబ్బతిన్న సరఫరా వ్యవస్థను తిరిగి నిర్మించుకోవడం, కార్మికులు తిరిగి పనిలోకి వచ్చి చేరడం వంటి ఎన్నో సవాళ్లను పరిశ్రమ ఎదుర్కొంటోంది. ఎన్నో ఇతర రంగాల మాదిరే తయారీ, డీలర్‌షిప్‌లను మూసివేయడం వల్ల ఆటోమోటివ్‌ వ్యాల్యూ చైన్‌ పూర్తిగా నిలిచిపోయింది. తిరిగి కార్యకలాపాల ప్రారంభానికి వీలుగా డీలర్‌ భాగస్వాములతో సన్నిహిత సంప్రదింపులు జరుపుతున్నాం. సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణంలో డిమాండ్‌కు ప్రేరణనిచ్చేందుకు వీలుగా వారికి మా పూర్తి మద్దతును అందిస్తున్నాం. విక్రయాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేశాం. కస్టమర్లు కొనుగోలు చేస్తే ఇంటి వద్దకే వాహనాన్ని డెలివరీ చేసే ఏర్పాటు చేశాం.

– నవీన్‌సోని, టీకేఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌   


ట్రాక్టర్ల డిమాండ్‌కు సానుకూలతలు: ఎంఅండ్‌ఎం
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించడంతో వ్యాపారంపై ప్రభావం పడింది. కొన్ని రోజుల క్రితమే డీలర్లు పాక్షికంగా కార్యకలాపాలను ప్రారంభించారు. సమీప భవిష్యత్తులో పలు సానుకూలతలు కనిపిస్తున్నాయి. రబీ ఉత్పత్తి మంచిగా ఉండడం, ప్రభుత్వం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించడం, పంటలకు చక్కని ధరలు ఉంటాయన్న సంకేతాలు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు.. ఇవన్నీ ట్రాక్టర్ల డిమాండ్‌ను పెంచుతాయి. కొన్ని వారాల విక్రయాలకు సరిపడా స్టాక్స్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌ సవరణల తర్వాత ఎన్‌బీఎఫ్‌సీల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడం, క్షేత్ర స్థాయిలో విక్రయ కార్యకలాపాలపైనే పనితీరు పురోగతి ఆధారపడి ఉంటుంది.
– సందీప్‌ సిక్కా, మహీంద్రా  ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగం ప్రెసిడెంట్‌  

హెచ్‌ఎంఎస్‌ఐ చీఫ్‌గా అత్సుషి ఒగాటా
హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రెసిడెంట్, సీఈవో, ఎండీగా అత్సుషి ఒగాటాను మాతృ సంస్థ హోండా మోటార్‌ కంపెనీ నియమించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న మినోరు కటు తిరిగి హోండా మోటార్‌ కంపెనీలో ఆపరేటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవి చేపట్టనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement