షావోమి స్మార్ట్‌టీవీ..

Xiaomi Redmi Note 5, Redmi Note 5 Pro quick review - Sakshi

‘ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4’ ఆవిష్కరణ  

ధర రూ.39,999 

రెడ్‌మిలో నోట్‌ 5,  నోట్‌ 5 ప్రో ఫోన్స్‌ విడుదల 

వీటి ప్రారంభ ధర రూ.9,999 

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘షావోమి’ తాజాగా భారత్‌లో టెలివిజన్‌ విభాగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతి పలుచనైనా టీవీని ‘ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4’ పేరుతో మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.39,999.  ఇది శాంసంగ్, సోనీ టీవీలకు గట్టిపోటీనిస్తుందని అంచనా.  న్యూఢిల్లీలో బుధ వారం జరిగిన ఒక కార్యక్రమంలో టీవీతోపాటు కంపెనీ రెండు స్మార్ట్‌ఫోన్లను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రో అనేవి ఇందులో ఉన్నాయి. ఈ ప్రొడక్టులన్నీ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్,  ఎంఐహోమ్స్‌ (ఆఫ్‌ లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌), ఎంఐ.కామ్‌లో ఫిబ్రవరి 22 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి.    

టీవీ ఫీచర్లు ఇవే.. 
ఇందులో 4.9 ఎంఎం అల్ట్రా–థిన్‌ ఫ్రేమ్‌లెస్‌ డిజైన్, 55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్, 4కే రెజల్యూషన్‌ (3840–2160 పిక్సెల్స్‌), హెచ్‌డీఆర్‌ సపోర్ట్, 64 బిట్‌ 1.8 గిగాహెర్ట్‌ ్జ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, మూడు హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్స్, రెండు యూఎస్‌బీ పోర్ట్స్, డ్యూయెల్‌ బాండ్‌ వై–ఫై, బ్లూటూత్‌ 4.0, డాల్బే+డీటీఎస్‌ సినిమా ఆడియో క్వాలిటీ, ప్యాచ్‌వాల్‌ ఓఎస్, మల్టీ లాంగ్వేజ్‌ సపోర్ట్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. 5,00,000లకుపైగా గంటల కంటెంట్‌ను అందించేందుకు వీలుగా హంగామా, ఏఎల్‌టీ బాలాజీ, జీ5, సోనీ లైవ్‌ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపింది.  

చైనా వెలుపల భారత్‌లోనే విక్రయం 
షావోమి కంపెనీ చైనా వెలుపల భారత్‌లోనే తొలిసారిగా టీవీలను విక్రయిస్తోంది. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఎయిర్‌ ఫ్యూరిఫయర్స్, మొబైల్‌ యాక్ససరీస్‌లను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ‘ఇండియా మాకు చాలా ముఖ్యమైన మార్కెట్‌. అతి తక్కువ కాలంలోనే ఇక్కడి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అధిక మార్కెట్‌ వాటాను కైవసం చేసుకున్నాం. స్మార్ట్‌ఫోన్స్‌ తర్వాత ఇప్పుడు టీవీలు మాకు అతిపెద్ద విభాగం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న టీవీ బ్రాండ్‌ మాది. టెలివిజన్‌ సెగ్మెంట్‌లో పోటీ కూడా ఎక్కువగా ఉంది’ అని షావోమి ఇండియా ఎండీ మను జైన్‌ తెలిపారు. భారతీయ వినియోగదారులకు దృష్టిలో ఉంచుకొని టీవీల్లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను పొందుపరిచామని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం టీవీలను దిగుమతి చేసుకుంటున్నాం. విక్రయాల ఆధారంగా వీటిని దేశీయంగానే తయారు చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.  భారత్‌లో దాదాపు 10 శాతం టెలివిజన్లు ఆన్‌లైన్‌లో విక్రయమౌతున్నాయని చెప్పారు. ఇందులో స్మార్ట్‌టీవీల వాటా చాలా తక్కువగా ఉందని తెలిపారు. ‘రెండేళ్ల కిందటనే ఇండియా మార్కెట్‌లోకి టీవీలు తీసుకురావడానికి పనులు ప్రారంభించాం. హంగామాలో వాటా కొనుగోలు తర్వాత ఈ దిశగా వడివడిగా అడుగులు పడ్డాయి’ అని పేర్కొన్నారు.

రెడ్‌మి ఫోన్స్‌ ప్రత్యేకతలు
నోట్‌ 5: ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో 5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ 18:9 డిస్‌ప్లే, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12 ఎంపీ రియర్‌ కెమెరా, సెల్ఫీ లైట్, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఇక రెడ్‌మి నోట్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ 3 జీబీ ర్యామ్‌/32 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.9,999గా, రూ.11,999గా ఉన్నాయి.  

నోట్‌ 5 ప్రో: వీటిల్లో 5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ 18:9 డిస్‌ప్లే, సాఫ్ట్‌ సెల్ఫీలైట్‌తో కూడిన 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌ (క్వాల్‌కామ్‌ నుంచి వస్తున్న లేటెస్ట్‌ పవర్‌ఫుల్‌  ప్రాసెసర్‌), 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 12 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ, 6 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.13,999గా, రూ.16,999గా ఉన్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top