భారత్‌లో షియోమి రెండో ఫోన్ | Sakshi
Sakshi News home page

భారత్‌లో షియోమి రెండో ఫోన్

Published Wed, Aug 27 2014 1:35 AM

భారత్‌లో షియోమి రెండో ఫోన్

 న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన షియోమి కంపెనీ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్, రెడ్‌మి 1ఎస్‌ను భారత్‌లోకి తెస్తోంది. రూ.5,999 ధర ఉండే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్(ఒకటి 3జీ, ఇంకొకటి 2జీ)ను వచ్చే నెల 2న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంచనున్నది. ఈ ఫోన్ కొనుగోళ్లకు ముందస్తు రిజిస్ట్రేషన్లు మంగళవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయని షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా పేర్కొన్నారు.  

ఈ ఫోన్‌లో 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, 1.6 గిగాహెర్ట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ,  8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు. షియోమి ఫ్లాగ్‌షిప్ మోడల్, ఎంఐ3ని ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మంచి అమ్మకాలు సాధించిన ఉత్సాహాంతో రెడ్‌మి 1ఎస్‌ను షియోమి భారత్‌లోకి తెస్తోంది. రూ.13,999 ధర ఉన్న ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటివరకూ 90 వేలు అమ్ముడయ్యాయి. ఒక్కో విడతకు 10,000-20,000 వరకూ ఆరు విడతల్లో ఈ ఫోన్‌లను కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆఫర్ చేసింది. ప్రతిసారి ఐదు సెకన్లలోనే ఫోన్లన్నీ అమ్ముడయ్యాయని కంపెనీ పేర్కొంది.

Advertisement
Advertisement