
భారతదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు తమ పోటీ సంస్థల ఉత్పత్తులను నేరుగా ప్రకటనల్లో పోలుస్తూ వివిధ మాధ్యమాల ద్వారా యాడ్‌లు ఇస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల యాపిల్, శామ్‌సంగ్ కంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా పోల్చే ప్రకటనలను ఉటంకిస్తూ షావోమీకి వేర్వేరుగా నోటీసులు జారీ చేశాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రత్యర్థి మార్కెటింగ్ వ్యూహాలను కట్టడి చేస్తూ, తమ బ్రాండ్ విలువను కాపాడుకోవడానికి మార్కెట్ లీడర్లు చేస్తున్న రక్షణాత్మక చర్యలను ఈ లీగల్ నోటీసులు హైలైట్ చేస్తున్నాయి.
వివాదానికి కారణం
ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్, కొన్ని శామ్‌సంగ్ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఈ ప్రచారం చేసిందని సమాచారం. ఇటీవల షావోమీ 15 అల్ట్రా మోడల్ ప్రకటనలను ఉంటకిస్తూ ధర, స్పెసిఫికేషన్లపై యాపిల్ ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్‌తో ప్రత్యక్ష పోలికలున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఎంపిక చేసిన శామ్‌సంగ్ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఇదే విధానాన్ని అనుసరించిందని కొన్ని సంస్థలు తెలిపాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ
యాపిల్, శామ్‌సంగ్ జారీ చేసిన లీగల్ నోటీసులు వాటి బ్రాండ్ ఇమేజ్‌కు మరింత నష్టం జరగకుండా ఉండటానికి తోడ్పడుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రాండ్ కన్సల్టెంట్ హరీష్ బిజూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘కొన్ని కంపెనీలు అనుసరిస్తున్న ఇలాంటి విధానాలు బ్రాండ్ వాల్యుయేషన్‌కు ముప్పుగా వాటిల్లుతున్నాయి. వీటిపై చట్టపరమైన చర్యలు ఎంతో అవసరం’ అని చెప్పారు. ఈ వ్యవహారంపై షావోమీ అధికారంగా స్పందించాల్సి ఉంది.